YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల

AP Congress Chief YS Sharmila Blasts TDP Government Over YSRs Name Removal
  • ఇటీవల వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు
  • తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరు తొలగింపు
  • తీవ్రస్థాయిలో స్పందించిన షర్మిల
ఇటీవల ఏపీలోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి వైఎస్సార్ కడప జిల్లాగా మార్చడం, కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరును తొలగించడం తెలిసిందే. దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టుగా ఉందని విమర్శించారు. 

అప్పుడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉండగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్సార్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని తెలిపారు. 

"వైఎస్సార్ జిల్లాను తిరిగి వైఎస్సార్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా... కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరును తీసెయ్యడాన్ని ఖండిస్తున్నాం. వైఎస్సార్ అంటే ఎందుకింత కక్ష అని అడుగుతున్నాం. 

వైఎస్సార్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు... విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ అనో లేక పాత కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు? అని ప్రశ్నిస్తున్నాం.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత వైఎస్సార్. 

తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదు. వైఎస్సార్ అనే పేరు ప్రజల ఆస్తి. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు. వైఎస్సార్ తెలుగు వారి సొత్తు" అని షర్మిల స్పష్టం చేశారు.
YS Sharmila
Chandrababu Naidu
YSR
Andhra Pradesh Politics
TDP
Congress
AP Politics
Name Change Controversy
Tadigadapa Municipality
YSR District

More Telugu News