Alka Yagnik: బిన్ లాడెన్ డెన్‌లో బాలీవుడ్ గాయని అల్కా యాజ్ఞిక్ పాటలు!

Alka Yagnik reacts to Osama bin Laden being her fan
  • అల్కా యాజ్ఞిక్ పాటలకు బిన్ లాడెన్ ఫిదా
  • లాడెన్ హైడౌట్‌లో అల్కా పాటల రికార్డింగులు లభ్యం
  • అతడు తన అభిమాని కావడం తన తప్పెలా అవుతుందన్న గాయని
  • ఆరేళ్ల నాటి అల్కా ఇంటర్వ్యూ వైరల్
బాలీవుడ్ ప్రముఖ గాయని అల్కా యాజ్ఞిక్ పాటలకు అల్ ఖైదా వ్యవస్థాపకుడు, ప్రపంచాన్నే వణికించిన కరుడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్ కూడా ఫిదా అయిపోయాడు. నిర్మాత అను రంజన్‌‌తో ఆరేళ్ల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో అల్కా యాజ్ఞిక్‌ మాట్లాడుతూ.. బిన్ లాడెన్ తన అభిమాని కావడంపై స్పందించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. 

2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో లాడెన్ దాక్కున్న ఇంటిపై దాడిచేసిన అమెరికా సీఐఏ ఆయనను హతమార్చింది. ఈ సందర్భంగా అక్కడ జరిపిన సోదాల్లో అల్కా యాజ్ఞిక్  పాటలకు సంబంధించి పలు రికార్డింగులు లభ్యమయ్యాయి. అలాగే, ఉదిత్ నారాయణ్, కుమార్ సాను పాటల రికార్డింగులు కూడా లభించాయి. 

లాడెన్ డెన్‌లో తన పాటలు లభించాయన్న వ్యాఖ్యలపై ఆ ఇంటర్వ్యూలో అల్కా మాట్లాడుతూ.. లాడెన్ తన అభిమాని కావడం తన తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కరుడుగట్టిన ఉగ్రవాది అయిన లాడెన్‌లోనూ ఓ కళాకారుడు ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా లాడెన్‌కు తన పాటలు నచ్చడం బాగుందని అన్నారు. అజయ్ దేవగణ్, కాజోల్ నటించిన ‘ప్యార్ తో హోనా హై థా’ సినిమాలో అల్కా పాడిన  ‘అజ్నాబీ ముజ్‌కో ఇత్నా బాతా’ వంటి పాటలు లాడెన్ డెన్‌లో లభించాయి. 

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అల్కాజీ.. అభిమానులు చాలా ప్రమాదకరం’ అని ఒకరు కామెంట్ చేస్తే.. అల్కాకు మించిన గాయనిని తాను ఇప్పటి వరకు చూడలేదు, వినలేదని మరో యూజర్ రాసుకొచ్చాడు. ‘హమ్ హై రాహీ ప్యార్ కే’ సినిమాలోని ‘గూంగట్ కీ ఆద్ సే’, ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలోని ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటలకు అల్కా రెండు జాతీయ ఫిల్మ్ అవార్డులు గెలుచుకున్నారు. 
Alka Yagnik
Osama Bin Laden
Bollywood

More Telugu News