Telangana: తెలంగాణ అసెంబ్లీలో పల్లా వర్సెస్ భట్టి

Telangana Assembly Session Palla Vs Batti

  • కాంగ్రెస్ సర్కారు అహంకారంతో వ్యవహరిస్తోందన్న పల్లా
  • వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ భట్టి కౌంటర్
  • మహిళా వర్సిటీని ఏనాడైనా సందర్శించారా అంటూ ప్రశ్న

తెలంగాణ శాసన సభలో శనివారం వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల హామీల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేస్తూ మిగతా వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపైనా పల్లా పలు వ్యాఖ్యలు చేశారు. దశ, దిశ లేదంటూ గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులపైనా కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ సర్కారు దాడి చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ.. విద్యాసంస్థలు నడుపుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారని ఆశించామని, ఆయన మాత్రం అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ పల్లాకు హితవు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించామని, మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో భాగస్వామి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏనాడైనా మహిళా యూనివర్సిటీని సందర్శించారా అని నిలదీశారు. విద్యాశాఖపై సమీక్ష జరపడానికి సీఎం రేవంత్ రెడ్డికి సమయంలేదంటూ పల్లా చేసిన ఆరోపణలను భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. విద్యాశాఖలో తమ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు.

భట్టి విక్రమార్క ఆరోపణలపై పల్లా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాం (2014-2023) లో 30 మందికి పైగా వీసీలను నియమించినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖపై ప్రభుత్వం దృష్టిపెడితే రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడి మానేశారని నిలదీశారు. పేర్లు మార్చడం వంటి చిన్న చిన్న పనులను పెద్దగా చెప్పుకోవడం మాని విద్యాశాఖలో సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లే కేఆర్‌ఎంబీ నడుస్తోందని ఆరోపించారు. మనకు హక్కుగా రావాల్సిన నీటి వాటాపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు.

Telangana
Assembly Session
Palla Rajeswar Reddy
Batti Vikramarka
Congress
BRS
  • Loading...

More Telugu News