Lift Accident: లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడి మృతి.. హైదరాబాద్ లో విషాదం

- ఆడుకుంటూ లిఫ్ట్ తలుపు మధ్యకు వెళ్లిన బాలుడు
- ఎవరూ గుర్తించకపోవడంతో ఘోరం
- కన్నీటిపర్యంతమైన వాచ్ మన్ కుటుంబం
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ లిఫ్ట్ వైపు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ అందులో ఇరుక్కుపోయాడు. ఎవరూ గుర్తించకపోవడంతో పది నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు. తీవ్రగాయాలైన బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఆసిఫ్ నగర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో బుధవారం రాత్రి జరిగిందీ ఘోరం. పోలీసులు, బాధిత వాచ్ మన్ కుటుంబం చెప్పిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ కాలనీలోని ముజ్తాబా అపార్ట్‌మెంట్ లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. నేపాల్ కు చెందిన శామ్ బహదూర్ ఈ అపార్ట్ మెంట్ కు వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. భార్యాబిడ్డలతో అపార్ట్ మెంట్ లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో ఉంటున్నాడు.
బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శామ్ బహదూర్ కొడుకు సురేందర్ (4) ఆడుకుంటూ లిఫ్ట్ వైపు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. కాసేపటి తర్వాత కొడుకు కనిపించడం లేదని బయటకు వచ్చిన తల్లిదండ్రులకు లిఫ్ట్ లో ఇరుక్కున్న సురేందర్ కనిపించాడు. రక్తమోడుతున్న కొడుకును చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. హాస్టల్ లో ఉంటున్న వారు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని బయటకు తీశారు. అప్పటికే స్పృహ తప్పిన సురేందర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడన్న సమాచారంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.