Director Geetha Krishna: సినిమాల్లో నటించే మహిళలపై అసభ్య కామెంట్లు.. సినీ దర్శకుడు గీతాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

Visakha Women complaints against director Geetha Krishna
  • గతంలో కొన్ని సినిమాలు తీసిన గీతాకృష్ణ
  • ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ల నిర్వహణ
  • మహిళలపై వెగటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ‘వావా’ సభ్యుల డిమాండ్
సినిమాల్లో నటించే మహిళలపై అసభ్య కామెంట్లు చేస్తున్న సినీ దర్శకుడు గీతాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్నం విమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వావా) సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీకి ఫిర్యాదు చేశారు. గీతాకృష్ణ అక్కయ్యపాలెంలో గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్, హైదరాబాద్ మాదాపూర్‌లో మరో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నారు. ఇటీవల వివిధ చానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.

గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో జరిగే వ్యవహారాలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ధనవంతుల పిల్లలే డ్రగ్స్ వాడతారని, సాధారణ ప్రజలకు అదేంటో తెలియదని అన్నారు. ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. అలాగే, సినిమాల్లో రొమాంటిక్ సీన్లను అమ్మాయిలు ఇష్టంతో చేయరని చెప్పారు. రూ. 50 లక్షలు ఇస్తే హీరోయిన్లు గెస్ట్‌హౌస్‌కు వెళతారని పేర్కొంటూ వెగటు వ్యాఖ్యలు చేశారు. ఇవే, కాదు సమయం చిక్కినప్పుడల్లా పరిశ్రమలోని మహిళలపై ఆయన నోరు పారేసుకుంటూ ఉంటారు.
Director Geetha Krishna
Geetha Krishna Film Institute
Visakhapatnam

More Telugu News