Actress Ranya Rao: నటి రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి ఫొటో!

- దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తెస్తూ దొరికిపోయిన రన్యారావు
- వెలుగులోకి వచ్చిన ఫొటోలో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర కూడా
- ఫొటోను షేర్ చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయ
- స్మగ్లింగ్‌లో సీఎం సిద్ధరామయ్య పాత్రపై అనుమానాలు
నటి రన్యారావు వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె వివాహ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరైన ఫొటోను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో షేర్ చేశారు. రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారం సీఎం సిద్ధరామయ్య ఇంటి వరకు వచ్చిందని, ఈ ఫొటోలో హోం మంత్రి జి.పరమేశ్వర కూడా ఉన్నారని ఆయన రాసుకొచ్చారు. ఈ కేసులో రాజకీయ సంబంధాలు లేవంటూ డీకే శివకుమార్ కొట్టిపడేశారని మాలవీయ విమర్శించారు.
దుబాయ్ నుంచి 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ రన్యారావు ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. తరచూ ఒకే రకమైన దుస్తులతో ఆమె దుబాయ్ వెళ్లడంతో అనుమానించిన అధికారులు నిఘా ఉంచగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు స్మగ్లింగ్‌లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పెళ్లికి హాజరైన అతిథులు, వారిచ్చిన కానుకలపై ఆరా తీస్తుండగా ఈ ఫొటో వెలుగులోకి వచ్చింది. దీంతో స్మగ్లింగ్‌లో ఆయన పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, విమానాశ్రయంలో తనిఖీల సమయంలో తప్పించుకునేందుకు సాయం చేసిన అధికారికి, సంబంధిత శాఖ అధికారుల నుంచి సూచనలు అందాయని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కోర్టుకు తెలిపింది.