Posani Krishna Murali: జడ్జి సమక్షంలో కన్నీటి పర్యంతమైన పోసాని!

- అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు
- వ్యక్తిగత కోపంతో తనపై ఫిర్యాదు చేశారన్న పోసాని
- 70 ఏళ్ల వయసులో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకువచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
కాగా, జడ్జి ఎదుట పోసాని కన్నీటిపర్యంతమయ్యారు. తనపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారని వాపోయారు. తన ఆరోగ్యం బాగా లేదని, ఇప్పటికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయని, స్టెంట్లు వేశారని తెలిపారు. 70 ఏళ్ల వయసులో నన్ను ఇబ్బంది పెడుతున్నారు... తప్పు చేస్తే నన్ను నరికేయండి... రెండ్రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం...! అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పోసానికి పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ, సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకోవడంతో విడుదల సాధ్యపడలేదు.