Vijayasai Reddy: కాకినాడ పోర్టు వ్యవహారంలో కీలక వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి: విజయసాయిరెడ్డి

YV Subba Reddy son Vikranth Reddy is key person in Kakinada Port shares deal case says Vijayasai Reddy

  • కాకినాడ పోర్టు వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారన్న విజయసాయి
  • కేవీ రావుకు విక్రాంత్ రెడ్డిని తానే పరిచయం చేశానని వెల్లడి
  • కేవీ రావుకు, వైవీ సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందని వ్యాఖ్య

కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. 

కాకినాడ పోర్టు వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారని విజయసాయి అన్నారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగానే విక్రాంత్ రెడ్డి తనకు తెలుసని సీఐడీ అధికారులకు తాను చెప్పానని అన్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా కేవీ రావును విక్రాంత్ రెడ్డికి పరిచయం చేశానని తెలిపారు. పోర్టు యజమాని కేవీ రావుతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ను కాపాడేందుకు మీరంతా యత్నిస్తున్నారా? అని సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారని... ఈ కేసుతో జగన్ కు సంబంధం లేదని తాను చెప్పానని తెలిపారు.

కేవీ రావుకు, వైవీ సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందని విజయసాయి తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి అమెరికాకు ఎప్పుడు వెళ్లినా కాలిఫోర్నియాలో కేవీ రావుకు చెందిన ఒక రాజభవనంలో ఉండేవారని చెప్పారు. పోర్టు వ్యవహారంతో జగన్ కు సంబంధం లేదని అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పారు. 

ఆది నుంచి అంతం వరకు పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డే అని కామన్ ఫ్రెండ్స్ తో కేవీ రావు చెప్పారని తెలిపారు. ఈ వ్యవహారం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని... సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. కేవీ రావు రాజకీయ బ్రోకర్ అని... ఆయనంటే తనకు అసహ్యమని చెప్పారు.

తాను వ్యవసాయం చేసుకుంటున్నానని... ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని విజయసాయి చెప్పారు. గతంలో నాయకుడిపై భక్తి ఉండేదని... ఇప్పుడు దేవుడిపై భక్తి ఉందని అన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని... తాను ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. భవిష్యత్తులో తనపై విమర్శలు, ఆరోపణలు చేసినా తాను పట్టించుకోనని అన్నారు.

  • Loading...

More Telugu News