Vijayasai Reddy: నన్ను ఎంతో అవమానించారు... కష్టపెట్టారు... వారిని పక్కన పెట్టకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదు: విజయసాయిరెడ్డి

- చుట్టూ ఉన్న కోటరీతో జగన్ నష్టపోతున్నారన్న విజయసాయిరెడ్డి
- మళ్లీ వైసీపీలో చేరనని స్పష్టీకరణ
- విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని వ్యాఖ్య
- వైసీపీలోనే ఉండాలని జగన్ కోరినా ఒప్పుకోలేదన్న విజయసాయి
- జగన్ బాగుండాలనే తాను కోరుకుంటున్నానని వ్యాఖ్య
కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారన్న కేసులో నిందితుడిగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎదగడానికి తనను కొందరు కిందకు లాగారని ఆయన అన్నారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. కోటరీ నుంచి బయటకు రాకపోతే జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు.
తన మనసులో జగన్ కు సుస్థిరమైన స్థానం ఉందని విజయసాయి చెప్పారు. జగన్ మనసులో మాత్రం తనకు స్థానం లేదని... అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని చెప్పారు. కోటరీ మాటలు వినొద్దని జగన్ కు స్పష్టంగా చెప్పానని తెలిపారు. భవిష్యత్తుల్లో మళ్లీ వైసీపీలో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. విరిగిపోయిన మనసు మళ్లీ అతుక్కోదని అన్నారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదని విజయసాయి అన్నారు. చెప్పుడు మాటలు వింటే... ఆ నాయకుడే కాదు... ప్రజలు, పార్టీ కూడా నష్టపోకతప్పదని చెప్పారు. తనకు, జగన్ మధ్య కొందరు విభేదాలు సృష్టించారని తెలిపారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ వద్దకు తీసుకెళతారని చెప్పారు. జగన్ వద్దకు ఎవరినైనా తీసుకెళ్లాలంటే... కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని తెలిపారు.
జగన్ బాగుండాలనే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను కోరుకుంటున్నానని అన్నారు. కోటరీ నుంచి బయట పడకపోతే జగన్ భవిష్యత్తు కష్టంగా ఉంటుందని చెప్పారు. "సార్... మీ మనసులో నాకు స్థానం లేదు. మీ మనసులో స్థానం లేనప్పుడు నేను పార్టీలో ఉండలేను. ఎవరు నిజాలు చెబుతున్నారో... ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అర్థం చేసుకోండి. కోటరీ నుంచి బయటపడండి" అని జగన్ తో తాను మాట్లాడినప్పుడు ఆయనకు స్పష్టంగా చెప్పానని విజయసాయి తెలిపారు.
పార్టీలో తనకు ఎన్నో పదవులు ఇచ్చారని... దీన్ని తాను కాదనడంలేదని చెప్పారు. కానీ, తనను ఎన్నో విధాలుగా అవమానించారని, కష్టపెట్టారని... తన మనసు విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉండాలని జగన్ తనను కోరినప్పటికీ తాను ఒప్పుకోలేదని చెప్పారు.