Dastagiri: తనకు భద్రత పెంచాలని కడప ఎస్పీకి వినతిపత్రం అందించిన దస్తగిరి

- కడప జిల్లా ఎస్పీని కలిసిన దస్తగిరి
- వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వెల్లడి
- వివేకా కేసులో సాక్షుల మరణాల పట్ల ఆందోళన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి నేడు కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు. తనకు భద్రత పెంచాలంటూ ఎస్పీ అశోక్ కుమార్ కు వినతిపత్రం అందించాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ గతంలో తనకు ఉన్న భద్రతను తగ్గించారని, వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి తెలిపాడు. అసెంబ్లీలో కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని, సాక్షుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నాడు.
గతంలో కడప జైలులో డాక్టర్ చైతన్యరెడ్డి తనను బెదిరించారని కూడా దస్తగిరి తన వినతిపత్రంలో వివరించాడు. కొత్త ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో ఉన్న భద్రతనే ఇప్పుడూ కొనసాగించాలని కోరాడు.
సాక్షుల మరణాలపై సిట్ ఏర్పాటు
మరోవైపు, వివేకా హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు కీలక సాక్షులు మరణించడంతో వారి మరణాల వెనుక గల కారణాలను నిగ్గు తేల్చడానికి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సిట్ ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు, పులివెందుల డీఎస్పీలతో పాటు ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లు ఈ సిట్‌లో ఉన్నారు. సాంకేతిక, ఫోరెన్సిక్ నిపుణులు కూడా సిట్ బృందంలో భాగస్వాములుగా ఉన్నారు. గత ఆరేళ్లలో వివిధ కారణాలతో మరణించిన ఆరుగురు సాక్షుల మరణాలు సహజమైనవా, కావా అనే కోణంలో సిట్ దర్యాప్తు చేయనుంది.
సిట్ బృందం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటన ప్రారంభించింది. సాక్షుల మరణాల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించడానికి సిట్ అధికారులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో సమావేశమై విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. విచారణ ఏ విధంగా సాగించాలనే దానిపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. సిట్ అధికారులు ప్రాథమికంగా సాక్షుల వివరాలను సేకరిస్తున్నారు. మూడు రోజుల కిందట వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరేళ్లలో అనుమానాస్పదంగా మరణించిన సాక్షుల వివరాలను సిట్ లోతుగా విచారించనుంది.