Crisil: ఫిబ్రవరిలో తగ్గిన మాంసాహార, శాకాహార భోజనం ఖర్చులు

Prices of veg and non veg thali decline nearly 5 percent in February says Crisil
  • నివేదిక విడుదల చేసిన దేశీయ రేటింగ్ సంస్థ ‘క్రిసిల్’
  • 5 శాతం తగ్గిన శాకాహార, మాంసాహార భోజన వ్యయం
  • కూరగాయలు, బ్రాయిలర్ ధరలు తగ్గడమే కారణం
ఫిబ్రవరి నెలలో భోజన ఖర్చులు తగ్గినట్టు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కూరగాయలు, బ్రాయిలర్ కోడిమాంసం ధరలు తగ్గడంతో శాకాహార, మాంసాహార భోజన తయారీ ఖర్చులు 5 శాతం తగ్గినట్టు పేర్కొంది. దిగుబడి పెరిగి కూరగాయల ధరలు తగ్గడంతో శాకాహారం, బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్ ధరలు తగ్గడంతో మాంసాహార భోజన వ్యయం తగ్గినట్టు నెలలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదికలో క్రిసిల్ పేర్కొంది.

ఇక, వార్షిక పద్ధతిన చూస్తే ఇంట్లో వండిన శాకాహార భోజన వ్యయం ఒక శాతం తగ్గగా, మాంసాహార భోజన వ్యయం 6 శాతం పెరిగింది. టమాటా, వంట గ్యాస్ ధరలు తగ్గడంతో గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో శాకాహార భోజనం ధరలు తగ్గాయి. కిలో టమాటా నిరుడు ఫిబ్రవరిలో రూ. 32 ఉండగా, ఈసారి అదే నెలలో 28 శాతం తగ్గి రూ. 23కు చేరుకుంది. టమాటా దిగుబడి 20 శాతం పెరగడమే ఇందుకు కారణం.

గతేడాదితో పోలిస్తే బ్రాయిలర్ ధరలు 15 శాతం పెరగడంతో మాంసాహార భోజనం ఖరీదు అయింది. మాంసాహార భోజనంలో 50 శాతం ఖర్చు బ్రాయిలర్‌దే. గతేడాది బ్రాయిలర్ ధరలు తగ్గగా, ఈసారి కోళ్ల దాణా వ్యయాలు పెరగడంతో బ్రాయిలర్ చికెన్ ధర పెరిగింది. ఇక, జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఉల్లి 7 శాతం, బంగాళాదుంప 17 శాతం, టమాటా 25 శాతం, బ్రాయిలర్ 5 శాతం ధరలు తగ్గాయి.
Crisil
Thali
Veg Meals
Non Veg Meals
Food

More Telugu News