సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని...!

  • సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2.25 లక్షలు వసూలు చేసిన కన్సల్టెన్సీ యజమాని
  • ఫేక్ కంపెనీ పేరుతో ఆఫర్ లెటర్ ఇచ్చి మోసం 
  • మోసపోయిన గుంటూరుకు చెందిన యువకుడు
  • మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు యువకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. కన్సల్టెన్సీల పేరుతో నిరుద్యోగ యువతను మోసగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎ. సాయికుమార్ అనే బీటెక్ పూర్తి చేసిన యువకుడు ఓ కన్సల్టెన్సీ వ్యక్తికి రూ.2.25 లక్షలు చెల్లించి మోసపోయాడు.

బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ కాలనీలో హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సాయికుమార్‌కు కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని జానీ అనే యువకుడు నమ్మబలికాడు. అమర్‌నాథ్ అనే కన్సల్టెంట్‌కు డబ్బులు ఇప్పించాడు. డబ్బులు చెల్లించిన మూడు నెలలకు ఓ కంపెనీ పేరుతో జూమ్ కాల్ ఇంటర్వ్యూ నిర్వహించి, ఆ కంపెనీ పేరుతోనే ఆఫర్ లెటర్ సాయికుమార్‌కు పంపించాడు అమర్‌నాథ్.

అయితే, ఆ కంపెనీ గురించి సాయికుమార్ ఆన్‌లైన్‌లో వెతకగా ఎక్కడా వివరాలు తెలియరాలేదు. దీంతో అనుమానం వచ్చి అమర్‌నాథ్‌ను సాయికుమార్ నిలదీయగా, అప్పటి నుంచి అతడు ఫోన్ ఎత్తడం మానేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సాయికుమార్ మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News