Revanth Reddy: తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరూ రావడంలేదు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy slams opposition parties over caste census
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పద్మశాలి మహాసభ
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
  • కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పద్మశాలి మహాసభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కులగణనతో బీసీలకు న్యాయం చేయాలన్నది రాహుల్ గాంధీ ఆశయం అని, తెలంగాణ వ్యాప్తంగా పకడ్బందీగా కులగణన చేశామని స్పష్టం చేశారు. కులగణన నచ్చనివారే సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణనలో తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరూ రావడంలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తూ, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలకపాత్ర అని వెల్లడించారు. ఉద్యమం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. నీడ లేని వాళ్లకు తన ఇల్లు ఇచ్చారని వివరించారు. అలాంటి మహనీయుడిని, తెలంగాణ వచ్చాక పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మాజీ సీఎం వెళ్లలేదని పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి  కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించారు. 

తమ ప్రభుత్వంలో రైతులతో పాటు నేతన్నలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల్లోని స్త్రీలకు రెండు చీరల చొప్పు ఇస్తామని వెల్లడించారు. నేతన్నలకు రూ.1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 


Revanth Reddy
Caste Census
Congress
brs
BJP

More Telugu News