Naga Babu: క్రిమినల్ కేసులు లేవు.. రూ. 70 కోట్ల ఆస్తులున్నాయి.. అఫిడవిట్‌లో నాగబాబు

Nagababu files nomination in MLC elections Here are the details
  • ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాగబాబు
  • ఎన్నిక సంఘానికి అఫిడవిట్ దాఖలు
  • మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 55.37 కోట్ల పెట్టుబడులు
  • రూ. 67.28 లక్షల విలువైన బెంజ్‌కారు ఉన్నట్టు వెల్లడి
  • చిరంజీవి నుంచి రూ. 28,48,871, పవన్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు వెల్లడి
ఏపీలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన నాగబాబు నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం..  నాగబాబు మ్యూచువల్ ఫండ్స్/బాండ్ల రూపంలో రూ. 55.37 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆయన వద్ద చేతిలో రూ. 21.81 లక్షల నగదు, బ్యాంకులో రూ. 23.53 లక్షలు ఉండగా, ఇతరులకు రూ. 1.03 కోట్లు అప్పుగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే, తన వద్ద రూ. 67.28 లక్షల విలువైన బెంజ్‌కారు, రూ. 11.04 లక్షల విలువైన హ్యుందయ్ కారు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రూ. 18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం తన వద్ద, రూ. 16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, రూ. 57.90 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ. 21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి తన భార్య వద్ద ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, తనకు, తన భార్యకు కలిపి రూ. 59.12 కోట్ల చరాస్తులు ఉన్నట్టు తెలిపారు.

ఇక, స్థిరాస్తుల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల రూ. 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ. 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు, అదే ప్రాంతంలో రూ. 50 లక్షల విలువ చేసే ఐదెకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో రూ. 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి ఉంది.

హైదరాబాద్‌లోని మణికొండలో రూ. 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా కలిపి మొత్తంగా రూ. 11.20 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక, అప్పుల విషయానికి వస్తే.. రెండు బ్యాంకుల్లో రూ. 56.97 లక్షల గృహరుణం, రూ. 7,54,895 కారు రుణం ఉన్నాయి. అలాగే, ఇతర వ్యక్తుల వద్ద రూ.1.64 కోట్ల అప్పులున్నాయి. అన్న చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు నాగబాబు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Naga Babu
MLC
Pawan Kalyan
Janasena
Chiranjeevi

More Telugu News