Cricketer Nagaraju: నేను కోడెల కుటుంబపై ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదు: ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు

Andhra former cricketer Nagaraju gives clean chit for Kodela family
  • గతంలో కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేసిన మాజీ క్రికెటర్ నాగరాజు
  • రైల్వేలో ఉద్యోగం పేరిట రూ.15 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు
  • తాజాగా నరసరావుపేట కోర్టుకు హాజరైన నాగరాజు
  • కోడెల కుటుంబం ఏ తప్పు చేయలేదని వెల్లడి
  • విజయసాయి, గోపిరెడ్డి బెదిరించారని ఆరోపణ
ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు నేడు నరసరావుపేట కోర్టుకు వచ్చాడు. గతంలో కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు శివరామ్ పై నాగరాజు ఫిర్యాదు చేశాడు. రూ.15 లక్షల లంచానికి సంబంధించిన ఈ కేసు విచారణ నిమిత్తం నాగరాజు తాజాగా కోర్టుకు హాజరయ్యాడు. 

విజయసాయి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల ఒత్తిడి కారణంగానే కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేశానని నాగరాజు వెల్లడించాడు. కోడెలపైనా, ఆయన కుమారుడిపైనా కేసు పెట్టాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని వివరించాడు. కేసు పెట్టకపోతే రంజీల్లో ఆడనివ్వబోమని బెదిరించారని వాపోయాడు. తాను కోడెల కుటుంబపై ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని నాగరాజు స్పష్టం చేశాడు. తప్పుడు కేసు పెట్టినందుకు తనను కోడెల అభిమానులు క్షమించాలని కోరాడు. నరసరావుపేట, పరిసర ప్రాంతాల అభివృద్ధిలో కోడెల శివప్రసాద్ కృషి మరువలేనిదని కొనియాడాడు. 

తనకు రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు శివరామ్ మోసం చేశారని 2019లో నాగరాజు నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తాను కోడెల శివరామ్ కు రూ.15 లక్షలు చెల్లించానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

అప్పట్లో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్నాళ్లకు మాజీ క్రికెటర్ నాగరాజు తెరపైకి వచ్చి కోడెల కుటుంబానికి క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం.
Cricketer Nagaraju
Kodela Family
Police Case
Narasaraopet

More Telugu News