Rahul Gandhi: రాహుల్ గాంధీ ధారావి పర్యటనపై శివసేన నేత విమర్శలు

- ఓ యూట్యూబర్ లాగా వచ్చాడు, వీడియో తీసుకున్నాడు, వెళ్లిపోయాడంటూ ఫైర్
- ముంబై కాంగ్రెస్ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నా స్థానిక నేతలను రాహుల్ కలవలేదని ఆరోపణ
- రూ.5 లక్షల కరెంట్ బిల్ బకాయిపడిందని వెల్లడి
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముంబై పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిలా కాకుండా ఓ యూట్యూబర్ లాగా వచ్చి వీడియోలు తీసుకుని వెళ్లిపోయాడని మండిపడ్డారు. ముంబై కాంగ్రెస్ పార్టీ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పటికీ స్థానిక నేతలను కలవకుండానే రాహుల్ తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు. శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో సంజయ్ నిరుపమ్ కాంగ్రెస్ పార్టీ ముంబై చీఫ్ గా పనిచేశారు. తాను కాంగ్రెస్ లో ఉన్నపుడు పార్టీకి ఇలాంటి పరిస్థితిని రానివ్వలేదని ఆయన పేర్కొన్నారు.
ముంబైలోని ధారావిలో రాహుల్ గాంధీ ఈ నెల 6న పర్యటించారు. అక్కడి తోలు పరిశ్రమ కార్మికులను కలుసుకున్నారు. స్థానిక పరిశ్రమలను సందర్శించి, కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అయితే, ఈ పర్యటనలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ స్థానిక నేతలను కలుసుకోలేదు. దీనిని ఎత్తిచూపుతూ సంజయ్ నిరుపమ్ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ముంబై కాంగ్రెస్ ఓట్లలోనే కాదు ఆర్థికంగానూ దివాలా అంచున ఉందని ఆరోపించారు. విద్యుత్ శాఖకు ఆ పార్టీ కార్యాలయం రూ.5 లక్షలు బకాయిపడిందని చెప్పారు. పార్టీ కార్యాలయం అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరిందని, కొన్ని నెలల అద్దె బకాయిపడిందని తెలిపారు. పార్టీ రాష్ట్ర శాఖ ఇలాంటి పరిస్థితిలో ఉంటే మాజీ అధినేత, పార్టీ అగ్రనేత ముంబై వచ్చినా స్థానిక నేతలను కలుసుకోకుండానే వెళ్లిపోవడమేంటని సంజయ్ నిరుపమ్ నిలదీశారు.