Biryani: రూ.8 లక్షలు ఖర్చు పెట్టించిన బిర్యానీ.. ఎముక గొంతులో ఇరుక్కోవడంతో ముంబై మహిళ అవస్థ

Mumbai Woman Undergoes 8 Hour Long Throat Surgery After Having Biryani With Family

  • 8 గంటల పాటు ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
  • నెల రోజుల అవస్థల తర్వాత కోలుకున్న వైనం
  • ఇక జన్మలో బిర్యానీ తినేది లేదన్న ముంబై మహిళ

కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తిన్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. బిర్యానీలోని ఎముక గొంతులో ఇరుక్కోవడంతో నెల రోజుల పాటు అవస్థ పడింది. చిన్న ఎముక డాక్టర్లను 8 గంటల పాటు శ్రమించేలా చేసింది.. ఆమె భర్తతో రూ.8 లక్షల ఖర్చు చేయించింది. ముంబై మహిళకు ఎదురైన ఈ అనుభవానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన రూబీ షేక్ ఫిబ్రవరి 3న కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. అందరితో కలిసి బిర్యానీ ఆరగించింది. అయితే, ఓ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో హోటల్ నుంచి తిన్నగా ఆసుపత్రికి వెళ్లిన రూబీకి వైద్యులు సీటీ స్కాన్ చేయాలని చెప్పారు. అయితే,అదేమీ అక్కర్లేదని రూబీ ఇంటికి వెళ్లిపోయింది.

తర్వాత రెండు రోజులకు తీవ్రమైన జ్వరం, హైబీపీతో ఆసుపత్రికి వచ్చింది. ఎక్స్ రే, సిటి స్కాన్ చేసిన వైద్యులకు గొంతులో ఇరుక్కుపోయిన ఎముక కనిపించింది. దీంతో దాదాపు 8 గంటల పాటు ఆపరేషన్ చేసి ఆ ఎముకను బయటకు తీశారు. అయితే, గొంతులోకి చేరిన ఆహారం ఏదైనా కిందికి జారుతుందని, అందుకు విరుద్ధంగా ఈ ఘటనలో ఎముక గొంతు పైభాగానికి ప్రయాణించిందని వైద్యులు తెలిపారు. మత్తుమందు ఇచ్చినపుడు పేషెంట్ రూబీ దగ్గడం వల్ల గొంతులోని ఎముక పైకి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఆపరేషన్ కు మొత్తం 8 లక్షల బిల్లు అయిందని రూబీ భర్త చెప్పారు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు అందించిన విరాళాలతో ఈ మొత్తం పోగేసినట్లు వివరించారు. కాగా, ఈ ఆపరేషన్ తర్వాత 21 రోజుల పాటు గొంతులో అమర్చిన ప్రత్యేకమైన పైప్ ద్వారానే రూబీ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాతే కోలుకున్నానని ఆమె చెప్పింది. తనను ఇన్ని అవస్థలపాలు చేసిన బిర్యానీని ఇక జన్మలో తినబోనని, ఇంట్లో వండబోనని రూబీ తేల్చిచెప్పింది.

Biryani
Mumbai Woman
Throat Surgery
8 Lakhs Fee
Bone in Throat
  • Loading...

More Telugu News