Goa: డబ్బులు లెక్కపెట్టుకోవడంలో మంత్రులు బిజీ: గోవా ప్రభుత్వంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Goa BJP leader accuses government of corruption
  • పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌తో భేటీ అనంతరం పాండురంగ మడైకర్ సంచలన ఆరోపణలు
  • ఓ చిన్న పని కోసం మంత్రికి తాను రూ. 20 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణ
  • ఆ మంత్రి పేరు బయటపెట్టాలని బీజేపీ సహచర నేతల డిమాండ్
గోవాలోని సొంత ప్రభుత్వంపై బీజేపీ నేత పాండురంగ మడైకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మంత్రులు డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బీజీగా ఉన్నారని ఆరోపించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన ఏ ఒక్కరి పేరు ప్రస్తావించలేదు. పాండురంగ వ్యాఖ్యలపై ఆయన సహచర నేతలు తీవ్రంగా స్పందిస్తూ, అవినీతి మంత్రుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ మంగళవారం బీజేపీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. దీనికి హాజరైన పాండురంగ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఓ చిన్న పని కోసం మంత్రికి తాను స్వయంగా రూ. 15 నుంచి రూ. 20 లక్షలు సమర్పించుకున్నట్టు చెప్పారు. ‘‘మంత్రులందరూ డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. గోవాలో ఏమీ జరగడం లేదు’’ అని ఆరోపించారు. దివంగత మనోహర్ పారికర్ క్యాబినెట్‌లో పాండురంగ మంత్రిగా పనిచేశారు.

‘‘నేను కూడా మంత్రిగా పనిచేశాను. కాబట్టి మంత్రులు ఎలా పనిచేస్తారో నాకు తెలుసు. ఒక చిన్న పని కోసం స్వయంగా నేనే రూ. 15 నుంచి రూ. 20 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అంత డబ్బు తీసుకున్నా పని మాత్రం చేయలేదు. నా ఫైలు పెండింగ్‌లో పెట్టారు. నేను ఫోన్ చేస్తే నన్ను కలిసేందుకు కానీ, మా పని చేసిపెట్టడానికి కానీ నిరాకరిస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

పాండురంగ ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు, బీజేపీ కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో పేరు బయట పెట్టాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలని గోవా పరిశ్రమల మంత్రి మౌవిన్ గోడిన్హో విమర్శించారు. దమ్ముంటే ఆ మంత్రి పేరు బయటపెట్టాలని, లేదంటే ఇలాంటి ఆరోపణలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సుభాష్ ఫల్ దేశాయ్ మాట్లాడుతూ.. పని చేసి పెడతానని తాను ఎవరి నుంచీ డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అసలు డబ్బులు తీసుకునేందుకు తనకు ఎలాంటి డిపార్ట్‌మెంట్ లేదని, కాబట్టి ఇలాంటి ఆరోపణలపై స్పందించబోనని స్పష్టం చేశారు. 
Goa
BJP
Pandurang Madaikar

More Telugu News