Kalpana: ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు.. స్పందించిన గాయని కల్పన

- తాను ఆత్మహత్యాయత్నం చేయలేదన్న కల్పన
- కూతురుతో మనస్పర్ధల వల్ల నిద్రపట్టక అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడి
- ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పారన్న పోలీసులు
తన కూతురు విషయంలో తాను ఆత్మహత్యాయత్నం చేశానని జరుగుతోన్న ప్రచారంపై ప్రముఖ గాయని కల్పన స్పందించారు. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని ఆమె తెలిపారు. తన కూతురు విషయంలో చోటు చేసుకున్న మనస్పర్థల వల్ల నిద్ర పట్టకపోవడంతో అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కూకట్‌పల్లి హసింగ్ బోర్డు పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిద్రమాత్రలు అధికంగా వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు.
కల్పన ఐదేళ్లుగా భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నారని పోలీసులు వెల్లడించారు. కూతురు దయా ప్రసాద్‌కి, కల్పనకు చదువు విషయంలో మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంటికి కల్పన ఒక్కరే వచ్చారని వెల్లడించారు. భర్త ప్రసాద్... కల్పనకు పలుమార్లు ఫోన్ చేశారని, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేశారని పోలీసులు వెల్లడించారు.
వెల్ఫేర్ సభ్యులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు, కాలనీ వెల్ఫేర్ సభ్యులు కలిసి తలుపు తెరిచేందుకు ప్రయత్నించారని, ఫలితం లేకపోవడంతో వెనుక వైపు ఉన్న కిచెన్ డోర్ నుండి లోనికి ప్రవేశించి, అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.