Nayanthara: కమల్‌హాసన్.. అజిత్.. నయనతార.. నెక్స్ట్ ఎవరు?

- పేరుకు ముందు బిరుదులతో పిలవొద్దని కొంత మంది తారల విజ్క్షప్తి
- తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసిన నయనతార
- తనను లేడి సూపర్‌స్టార్‌గా పిలవొద్దని ఆ లెటర్‌లో తెలిపిన నయనతార
సినీ తారలను అభిమానులు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా కొన్ని పేర్లతో పిలుచుకుంటారు. టాలీవుడ్‌లో చిరంజీవిని మెగాస్టార్‌గా, నందమూరి బాలకృష్ణను యువరత్నగా, నాగార్జునను యువ సామ్రాట్‌గా, వెంకటేశ్‌ను విక్టరీ పేరుతో, యువ స్టార్ హీరోలను సైతం యంగ్ టైగర్, ఐకాన్‌స్టార్, గ్లోబల్ స్టార్, రెబల్‌స్టార్.. ఇలా వారి ఇమేజ్‌కు తగిన విధంగా తమ అభిమాన హీరోలను పిలుచుకుంటారు. అంతేకాదు, హీరోయిన్ల విషయానికొస్తే రష్మిక మందన్నాను నేషనల్ క్రష్‌గా, నయనతారను లేడీ సూపర్‌స్టార్‌గా వారి అభిమానులు అభివర్ణిస్తుంటారు.
అయితే, ఇలా తమ పేర్లకు ముందు ఇలాంటి ట్యాగ్‌లను తగిలించుకోవడం కొంతమందికి ఇష్టం ఉండటం లేదు. ఇటీవల కథానాయకుడు కమల్‌హాసన్ తన పేరుకు ముందు ‘ఉలగనాయగన్’ అనే ట్యాగ్‌తో ఇక నుంచి ఎవరూ పిలవకూడదని మీడియాతో పాటు అభిమానులు కూడా ఉలగనాయగన్ అని పిలవడం ఆపేయాలని, కేవలం కమల్‌హాసన్ అనే పిలుపులోనే అందరి ఆత్మీయత ఉంటుందని అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే అజిత్ కూడా తన పేరుకు ముందు ఉన్న ‘కాదల్ మన్నన్’ అనే పదం తనకు ఇబ్బందిగా ఉందని, అభిమానులతో పాటు సినీ పరిశ్రమ, మీడియాలో కూడా ఎవరూ కూడా ఇక నుంచి తన పేరుకు ముందు ఆ పదంతో పిలవకూడదని విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.
ఇప్పుడీ జాబితాలో హీరోయిన్ నయనతార కూడా చేరారు. తాజాగా ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి తనను లేడీ సూపర్‌స్టార్ అని పిలవొద్దని అందులో కోరారు. అభిమానులు అలా పిలవడం తనకు ఆనందంగా ఉన్నా, నయనతార అని పిలవడం, రాయడమే తనకు సంతోషంగా ఉంటుందని, మీరు ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదు వెలకట్టలేనిదని, అయినా ఆ పిలుపు తనను కాస్త ఇబ్బంది పెడుతుందని ఈ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.
సినిమా అంటే తనకెంతో ఇష్టమని, సినిమా అందరినీ ఐక్యంగా ఉంచుతుందని ఆమె ఆ లేఖలో తెలిపారు. సో.. కోలీవుడ్‌లో వరుసగా ఇలాంటి ప్రకటనలు రావడం మనం చూస్తున్నాం. త్వరలోనే అక్కడ మరి కొంత మంది స్టార్స్ కూడా ఇలాంటి బహిరంగ ప్రకటనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఈ వరుసలో తదుపరి ప్రకటన ఎవరి నుంచి వస్తుందో చూద్దాం..