Maharashtra Minister: హత్య కేసులో ఆరోపణలు... మహారాష్ట్ర మంత్రి రాజీనామా

Maharashtra minister Dhananjay resigns
  • మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోశ్ దేశ్ ముఖ్ హత్య
  • మంత్రి  ధనంజయ్ సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ అరెస్ట్
  • ఫడ్నవిస్ ఆదేశాలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధనంజయ్
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ హత్య ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయాలని ఆయనను సీఎం ఫడ్నవిస్ ఆదేశించినట్టు సమాచారం. ఈ అంశంపై ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ... ధనంజయ్ రాజీనామాను తాను ఆమోదించి, గవర్నర్ కు పంపానని తెలిపారు. 

ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో ధనంజయ్ కీలక నేతగా ఉన్నారు. ఆయన సొంత జిల్లా బీడ్. సంతోష్ ను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. ఈ హత్య కేసులో ధనంజయ్ సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ధనంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

ధనంజయ్ కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను అజిత్ పవార్ కు తాను అందించానని సామాజిక కార్యకర్త అంజలి దమానియా చెప్పడంతో... మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎన్సీపీ (శరద్ పవార్) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ధనంజయ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ధనంజయ్ మాట్లాడుతూ... మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం ఫడ్నవిస్ లేదా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్తే వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ క్రమంలో చివరకు ఆయన రాజీనామా చేశారు.

Maharashtra Minister
Resign

More Telugu News