Kona Venkat: ఇటు చూస్తే ప్రేమపెళ్లి .. అటు చూస్తే అప్పులు: కోన వెంకట్

- సినిమా రచయితగా కోన వెంకట్ కు క్రేజ్
- నిర్మాతగాను కొనసాగుతున్న ప్రయోగాలు
- మైనర్ గా ఉన్నప్పుడే పెళ్లి జరిగిపోయిందని వెల్లడి
- ఒకానొక సమయంలో అప్పుల పాలయ్యానని వ్యాఖ్య
తెలుగు సినిమాకి సంబంధించి ఏ మాత్రం సమయాన్ని వృథా చేయని రచయితగా కోన వెంకట్ కనిపిస్తారు. కథ .. మాటలు రాయడంలో, స్క్రీన్ ప్లే వేయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఒక వైపున తన మార్క్ రచనలను పరిగెత్తిస్తూనే, మరో వైపున నిర్మాతగాను మారిపోయారు. అలాంటి కోన వెంకట్, తాజాగా 'ఎన్ టీవీ' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
" కాలేజ్ చదువు పూర్తి అవుతుందనగా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటికి నేను మైనర్ నే. మేజర్ కావడానికి ఓ 15 రోజులే సమయం ఉంది. కానీ అప్పటివరకూ వెయిట్ చేసే పరిస్థితులు కావు అవి. అప్పట్లోనే నా దగ్గర 50 - 60 లక్షలు ఉండేవి. అయితే పెళ్లి తరువాత చేసిన బిజినెస్ లు దెబ్బతిని అంతా పోయింది. అప్పుల కారణంగా నా భార్య నగలు కూడా అమ్మేశాను. ఒక వైపున లవ్ మ్యారేజ్ కారణంగా కేస్ ఫైల్ కావడంతో ఆ గొడవలు నడుస్తూ ఉండేవి .. మరో వైపున అప్పులు సతమతం చేసేవి" అని అన్నారు.
" రామ్ గోపాల్ వర్మ తమ్ముడు కోటి నా క్లాస్ మేట్. అందువలన తరచూ వాళ్లింటికి వెళుతూ ఉండేవాడిని. అలా వర్మతో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం కారణంగానే నాకు 'సత్య' సినిమాకి మాటలు రాసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో 'మామ .. కల్లు మామ' అనే పాట కూడా నేను రాసిందే. అలా నా కెరియర్ మొదలైంది. అప్పటి నుంచి ఇంతవరకూ వెనుదిరిగి చూసుకుంది లేదు" అని చెప్పారు.