రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం చేకూరేందుకు కొత్త జంట‌లు త్వ‌ర‌గా ఆ ప‌ని చేయాలి.. సీఎం స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి సీఎం స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు 
  • కొత్త జంట‌లు త్వ‌ర‌గా పిల్ల‌ల‌ను క‌నాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపు
  • డీలిమిటేష‌న్ ప్ర‌క్రియలో భాగంగా రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం చేకూరేందుకు ఇదొక్క‌టే మార్గమ‌న్న‌ సీఎం
త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డీలిమిటేష‌న్ ప్ర‌క్రియలో భాగంగా రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం చేకూరేందుకు కొత్త జంట‌లు త్వ‌ర‌గా పిల్ల‌ల‌ను క‌నాల‌ని అన్నారు. ఎందుకంటే జ‌నాభా ప్రాతిప‌దిక‌న నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జిస్తే, త‌మిళ‌నాట లోక్‌స‌భ స్థానాలు త‌గ్గుతాయ‌ని స్టాలిన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

సోమ‌వారం నాడు నాగ‌ప‌ట్నంలో జ‌రిగిన‌ ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి స్టాలిన్ మాట్లాడుతూ... నియోజ‌క‌వ‌ర్గాల‌ పున‌ర్విభ‌జన కార‌ణంగా న‌ష్ట‌పోకూడ‌దంటే కొత్తగా పెళ్లైన జంట‌లు త‌క్ష‌ణ‌మే పిల్ల‌లు క‌నాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. కొత్త జంట‌లు పిల్ల‌లు క‌నేందుకు స‌మ‌యంలో తీసుకోవాల‌ని గ‌తంలో తాను చెప్పాన‌ని, కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయ‌ని చెప్పారు. 

కేంద్ర ప్ర‌భుత్వం నియోజ‌క‌వ‌ర్గాల‌ పున‌ర్విభ‌జ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నందున ఇప్పుడు పిల్ల‌ల‌ను క‌నాల‌ని, మ‌నం జ‌నాభా పెంచుకోక‌పోతే న‌ష్ట‌పోతామ‌ని సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో, కొత్తగా పుట్టే పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని స్పష్టం చేశారు. 

మ‌రోవైపు ఇదే అంశంపై చ‌ర్చించ‌డానికి ఈ నెల 5న భారీ అఖిల‌ప‌క్ష భేటీకి  డీఎంకే స‌ర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ స‌మావేశానికి రావాలంటూ ఈసీ గుర్తింపు పొందిన 40కి పైగా రాజ‌కీయ పార్టీల‌కు స్టాలిన్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆహ్వానం పంపిందని స‌మాచారం.  
 


More Telugu News