Mad Square: 'మ్యాడ్ స్క్వేర్' విడుదల తేదీని అందుకే మార్చాం: నిర్మాత నాగవంశీ

- ప్రకటించిన తేది కంటే ఒకరోజు ముందుగానే మ్యాడ్ స్క్వేర్ విడుదల
- అమవాస్య కారణంగానే డేట్‌ను మార్చామన్న నిర్మాత
- మార్చి 28న విడుదల కాబోతున్న నితిన్ 'రాబిన్ హుడ్'
వినోదాత్మక చిత్రంగా అందరి ఆదరణ పొందిన 'మ్యాడ్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. పార్ట్-1 చిత్రంలో తమ నటనతో ఆకట్టుకున్న నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఈ 'మ్యాడ్ స్క్వేర్'లో కూడా నవ్వులు పూయించడానికి సిద్ధంగా ఉన్నారు. దర్శకుడు కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను కూడా విడుదల చేశారు. కాగా మొదటగా ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేస్తున్నామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. అయితే ఇప్పుడు చిత్రాన్ని ఒకరోజు ముందుగానే మార్చి 28న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ "డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు సినిమా విడుదల తేదీని ఒకరోజు ముందుకు మార్చాం. మార్చి 29న అమావాస్య ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ మార్పు మా సినిమా వసూళ్లకు మరింత ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను" అన్నారు.
"మా సినిమాతో పాటు అదే రోజు విడుదల కాబోతున్న నితిన్ సినిమా 'రాబిన్ హుడ్' కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. ఇక 'మ్యాడ్ స్క్వేర్', రాబిన్ హుడ్ రెండు చిత్రాలు ఎంటర్‌టైన్‌మెంట్ తరహా చిత్రాలే కావడంతో ట్రేడ్‌లో ఈ రెండు చిత్రాలపై మంచి ఆసక్తి నెలకొని ఉంది. అయితే సినిమా విడుదల తేదీని మార్చడం కూడా 'మ్యాడ్ స్క్వేర్'కు వసూళ్ల విషయంలో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.