Animal Movie: మాజీ ఐఏఎస్ వ్యాఖ్యలకు డైరెక్టర్ సందీప్ వంగా రిటార్ట్

- పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావొచ్చు కానీ సినిమా తీయలేరని వ్యాఖ్య
- యానిమల్ సినిమాపై మాజీ ఐఏఎస్ విమర్శలు
- తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన డైరెక్టర్
ఢిల్లీకి వెళ్లి ఏదో ఓ కోచింగ్ సెంటర్ లో చేరి పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావొచ్చేమో కానీ, పుస్తకాలు చదివి సినిమా తీయలేరంటూ డైరెక్టర్ సందీప్ వంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాజీ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. యానిమల్ సినిమాపై సదరు అధికారి చేసిన విమర్శలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా కౌంటర్ ఇచ్చారు.
ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘12 th ఫెయిల్’ సినిమాలో మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి యూపీఎస్సీ ప్రొఫెసర్ గా నటించారు. ఆ సినిమా విడుదల సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. యానిమల్ సినిమాపై విమర్శలు చేశారు. యానిమల్ లాంటి సినిమాలు సమాజానికి అవసరం లేదని, వాటిని నిర్మించడం ద్వారా కేవలం డబ్బు మాత్రమే సంపాదించగలరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్స్ పై యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ వంగా తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. అప్పట్లో సదరు మాజీ ఐఏఎస్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చారు. తాను ఏదో నేరం చేసినట్లు అనిపించిందని, ఆయన విమర్శలు అర్థరహితమని అనిపించిందని తెలిపారు. ఆ సమయంలో తాను ఒక్కటే అర్థం చేసుకున్నానని అంటూ.. ఐఏఎస్ అధికారి కావాలంటే ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకుని, కష్టపడి చదివితే చాలని అన్నారు. అదే సినిమా తీయాలన్నా లేక రచయిత కావాలన్నా ఎలాంటి కోర్సులు లేవని, పుస్తకాలు చదివి సినిమా తీయలేరని చెప్పారు. ఎవరికి వారే అన్నీ స్వయంగా నేర్చుకుని, అభిరుచితో మాత్రమే సినిమా తీయగలమనే విషయం తెలిసివచ్చిందని సందీప్ వంగా చెప్పారు.