ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ కు దూసుకెళ్లిన సఫారీలు.... సెమీస్ లో ఎవరు ఎవరితో తేలేది రేపే!

  • గ్రూప్-బీలో నేడు చివరి లీగ్ మ్యాచ్
  • ఇంగ్లండ్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా
  • గ్రూప్-బీలో అగ్రస్థానంతో సెమీస్ బెర్తు దక్కించుకున్న సఫారీ టీమ్
  • రేపు గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్... టీమిండియా-కివీస్ ఢీ
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ ఇంగ్లండ్ తో జరిగిన గ్రూప్-బి చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఘనంగా నెగ్గింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో నెగ్గి సెమీస్ బెర్తు కైవసం చేసుకున్నారు. 

కరాచీలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ కాగా... 180 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 29.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించింది. 

వాన్ డర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం నల్లేరుపై నడకలా సాగింది. అద్వితీయమైన కవర్ డ్రైవ్ లతో అలరించిన క్లాసెన్ 56 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ స్కోరులో 11 ఫోర్లు ఉన్నాయి. వాన్ డర్ డుసెన్ 87 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో అజేయంగా 72 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు సహకారం అందించాడు. 

అంతకుముందు, ఓపెనర్ గా ప్రమోషన్ అందుకున్న ట్రిస్టాన్ స్టబ్స్ (0) డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 27 పరుగులు చేశాడు. చివర్లో క్లాసెన్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ భారీ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. 

ఈ విజయంతో దక్షిణాఫ్రికా గ్రూప్-బిలో అగ్రస్థానం దక్కించుకుంది. ఈ గ్రూప్ నుంచి రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఇక, సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల ప్రత్యర్థులు ఎవరనేది రేపు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంతో స్పష్టత రానుంది. 

రేపు టీమిండియా గెలిస్తే... సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది... అప్పుడు మరో సెమీస్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆడతాయి. 

ఒకవేళ టీమిండియా రేపు ఓటమిపాలైతే... సెమీస్ లో దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు మరో సెమీస్ లో ఆసీస్, కివీస్ తలపడతాయి.


More Telugu News