Shreyas Iyer: నెట్ బౌల‌ర్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌..!

Jaskiran Singh Receiving a Pair of Shoes from India Batter Shreyas Iyer
  • నెట్‌ బౌల‌ర్ జ‌స్కిర‌న్ సింగ్‌కు షూ గిఫ్ట్‌గా ఇచ్చిన శ్రేయ‌స్‌
  • ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన యూఏఈ పార్ట్‌టైమ్ క్రికెటర్
  • భార‌త క్రికెట‌ర్ నుంచి స్పైక్స్ గిఫ్ట్‌గా అందుకోవ‌డం స్పెష‌ల్ మూమెంట్ అంటూ హ‌ర్షం
ప్రస్తుతం భార‌త క్రికెట్ జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే రెండు విజ‌యాల‌తో సెమీస్‌కు దూసుకెళ్లిన రోహిత్ సేన‌... త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను రేపు (ఆదివారం) కివీస్‌తో ఆడ‌నుంది. దీంతో టీమిండియా సభ్యులందరూ నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో నెట్‌ బౌల‌ర్ జ‌స్కిర‌న్ సింగ్‌కు స్టార్ ప్లేయ‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. 

ప్రాక్టీస్ మ్యాచ్ సంద‌ర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న అత‌నికి షూ గిఫ్ట్‌గా ఇచ్చాడు. శ్రేయ‌స్ నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న‌ జ‌స్కిర‌న్ సింగ్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. 

"నా జీవితంలో ఇదో స్పెష‌ల్ మూమెంట్‌. శ్రేయ‌స్ అయ్య‌ర్‌ నుంచి స్పైక్స్ అందుకున్నాను. లాంగాఫ్‌లో ఉన్న నా ద‌గ్గ‌రికొచ్చిన శ్రేయ‌స్‌ భాయ్.. 'పాజీ క్యా హాల్-చాల్, సబ్ బడియా?' మీ షూ సైజ్ ఎంత అని అడిగారు. 10 అని చెప్ప‌గానే నీ కోసం ఒక‌టి తెచ్చానంటూ షూ ఇచ్చారు. ఈ టోర్నీలో నేను ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా ఆట‌గాళ్ల‌కు ఫీల్డింగ్ చేశాను. కానీ, వారికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దాని కోసం ఎదురుచూస్తున్నాను" అని జ‌స్కిర‌న్ చెప్పుకొచ్చాడు. 

కాగా, వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) అయిన జస్కిరన్ సింగ్... యూఏఈలో పార్ట్‌టైమ్ క్రికెటర్. గత 18 సంవత్సరాలుగా యూఏఈలో ఉంటున్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నెట్ బౌల‌ర్‌గా ఎంపిక‌య్యాడు.
Shreyas Iyer
Jaskiran Singh
Shoes
Team India
Cricket
Champions Trophy 2025

More Telugu News