ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన వారి ఆచూకీ కొన్ని గంటల్లో లభించే అవకాశముంది: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • 5.8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురి ఆనవాళ్లు స్కానింగ్‌లో కనిపించాయన్న మంత్రి
  • మరో నలుగురు టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లుగా తెలుస్తోందన్న మంత్రి
  • సొరంగంలో లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో విమర్శించే వాళ్లకు తెలియదని ఆగ్రహం
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ మరికొన్ని గంటల్లో లభించే అవకాశముందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌ను కట్ చేస్తున్నామని తెలిపారు. మనుషుల ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఎస్ఎల్‌బీసీ సహాయక చర్యలపై ఆయన మాట్లాడుతూ, 5.8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురి ఆనవాళ్లు స్కానింగ్‌లో కనిపించాయని అన్నారు.

మరో నలుగురు టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లుగా తెలుస్తోందని వెల్లడించారు. సహాయక చర్యల్లో మొత్తం 11 విభాగాల వాళ్లు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. పనులు వేగంగా జరగడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ ఎస్ఎల్‌బీసీ సొరంగంలో లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వాళ్లకు తెలియదని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 200 కిలోమీటర్ల సొరంగం తవ్వినట్లు హరీశ్ రావు చెబుతున్నారని, మరి గత పదేళ్లలో ఎస్ఎల్‌బీసీలో 20 కిలోమీటర్లు కూడా ఎందుకు తవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో దీనిని పూర్తి చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని వ్యాఖ్యానించారు.


More Telugu News