Mukesh Ambani: ప్రపంచంలోని 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో అంబానీ, అదానీ

Mukesh Ambani and Gautam Adani are in Super Billionaires list
  • 5 వేల కోట్ల డాలర్ల సంపద దాటితే సూపర్ బిలియనీర్లు
  • 41,900 కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
  • 26,380 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో జెఫ్ బెజోస్  
  • 9,060 కోట్ల డాలర్ల సంపదతో 17వ స్థానంలో ముకేశ్ అంబానీ
  • 6,060 కోట్ల డాలర్లతో 22వ స్థానంలో గౌతం అదానీకి స్థానం
భారత బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ మరో ఘనత సాధించారు. 5 వేల కోట్ల డాలర్ల (రూ.4.35 లక్షల కోట్లు)కు పైగా సంపద కలిగిన 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో భారత్ నుంచి వీరు చోటు సంపాదించారు. 41,900 కోట్ల డాలర్ల (రూ. 36.45 లక్షల కోట్ల) నికర సంపదతో టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 26,380 కోట్ల డాలర్లతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలవగా, 9,060 కోట్ల డాలర్ల (రూ.7.88 లక్షల కోట్లు)తో ముకేశ్ అంబానీ 17వ స్థానంలో, 6,060 కోట్ల డాలర్ల (రూ. 5.27 లక్షల కోట్లు)తో గౌతమ్ అదానీ 22వ స్థానంలో నిలిచారు. 

ఇక, మస్క్ ప్రస్తుతం గంటకు 20 లక్షల డాలర్లు అంటే రూ. 17.4 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 2027 నాటికి ప్రపంచంలోనే ఆయన తొలి ట్రిలియనీర్ అవుతారని అంచనా. సగటు అమెరికన్ సంపదతో పోలిస్తే మస్క్ సంపద ఏకంగా 20 లక్షల రెట్లు అధికం కావడం గమనార్హం. 

కాగా, ఈ ఫిబ్రవరి ప్రారంభం నాటికి ప్రపంచంలోని కుబేరుల సంపద మొత్తంలో 16 శాతం ఈ సూపర్ బిలియనీర్లదే. 2014లో ఇది 4 శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడది నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. వీరి మొత్తం సంపాదన ప్రస్తుతం 3.3 లక్షల కోట్ల డాలర్లు. అంటే ఫ్రాన్స్ జీడీపీతో సమానం. ఇక, 24 మంది సూపర్ బిలియనీర్లలో 16 మంది సెంటీ బిలియనీర్లు (10 వేల కోట్ల డాలర్లు)గా గుర్తింపు పొందారు. 
Mukesh Ambani
Gautam Adani
Super Billionaires

More Telugu News