Vallabhaneni Vamsi: కస్టడీలో నా భర్తను చాలా ఇబ్బంది పెట్టారు: వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ

- నేటితో ముగిసిన వంశీ 3 రోజుల కస్టడీ
- తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్న పంకజశ్రీ
- వంశీ ఆస్తమాతో బాధపడుతున్నారని వెల్లడి
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రిమాండ్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మరోవైపు, వంశీ 3 రోజుల పోలీస్ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు జైలుకు తరలించారు.
ఇంకోవైపు, తన భర్త వంశీ గురించి ఆయన భార్య పంకజశ్రీ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని... గత మూడు రోజులుగా కస్టడీలో తన భర్తను పోలీసులు ఎంతగానో వేధించారని... కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని చెప్పారు. తన భర్త ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు.
తన భర్త అనారోగ్యం గురించి జడ్జి ఎదుట వివరించడం జరిగిందని... అయితే, తాను తాత్కాలిక న్యాయమూర్తినని, రెగ్యులర్ న్యాయమూర్తి వచ్చిన తర్వాత మీరు పిటిషన్ వేసుకోవాలని ఆయన చెప్పారని పంకజశ్రీ తెలిపారు. పోలీస్ కస్టడీ తర్వాత తన భర్తను జిల్లా జైలుకు తరలించారని చెప్పారు.