Pakistan: అందుకే టీమిండియాతో ఓడిపోయాం: పాక్ క్రికెట్ జట్టు కోచ్ జావెద్

Pakistan head coach finally opens up on humiliating defeat against India
  • అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వల్లే ఓడిపోయామన్న పాక్ కోచ్ 
  • భారత జట్టుతో ఆడాలంటే చాలా అనుభవం అవసరమని వ్యాఖ్య
  • ప్రస్తుత భారత జట్టు అత్యంత అనుభవజ్ఞులతో నిండి ఉందన్న పాక్ కోచ్
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వల్ల భారత్ చేతిలో ఓటమి చెందామని పాకిస్థాన్ క్రికెట్ కోచ్ అకీబ్ జావెద్ అన్నారు. భారత జట్టు చేతిలో ఓటమితో అభిమానుల కంటే ఆటగాళ్లు ఎక్కువగా బాధపడ్డారని ఆయన అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లలో పరాజయం పొంది టోర్నీ నుండి నిష్క్రమించింది. మొదట న్యూజిలాండ్, తర్వాత భారత్ చేతిలో ఓడిపోయింది. రేపు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

ఈ క్రమంలో పాక్ కోచ్ జావెద్ మీడియాతో మాట్లాడుతూ, ఒక్క దుబాయ్‌లోనే మ్యాచ్‌లు ఆడటం భారత జట్టుకు కలిసి వస్తుందని కొందరు చెబుతున్నారని, కానీ తమ ఓటమికి దానిని సాకుగా చూపబోమని ఆయన అన్నారు. ఒకే మైదానంలో ఆడటం, ఒకే హోటల్‌లో ఉండటం వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని, కానీ తమ జట్టు దాని వల్ల ఓడిపోలేదని పేర్కొన్నారు. తమతో మ్యాచ్‌కు ముందు భారత జట్టు దుబాయ్‌లో పది మ్యాచ్‌లు ఆడలేదని అన్నారు. 

తమ జట్టు మెరుగుపడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తదుపరి మ్యాచ్‌పై తాము దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కానీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగితే చాలా భావోద్వేగాలు ముడిపడి ఉంటాయని అన్నారు. భారత్‌తో ఓటమి వల్ల అభిమానులు, జర్నలిస్టుల కంటే ఆటగాళ్లే ఎక్కువగా మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన అన్నారు.

భారత జట్టుతో ఆడటానికి చాలా అనుభవం అవసరమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న భారత జట్టు అత్యంత అనుభవజ్ఞులతో నిండి ఉందని, కానీ పాక్ జట్టులో అనుభవజ్ఞులైన వారు లేరని వెల్లడించారు. బాబర్ అజామ్ మాత్రమే 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడని, మహ్మద్, రిజ్వాన్‌లకు కొంత అనుభవం ఉందని, మిగతా ప్లేయర్లంతా 30 మ్యాచ్‌ల కంటే తక్కువగా ఆడారని తెలిపారు.
Pakistan
Team India
Team Pakistan
Cricket

More Telugu News