Mr. Perfect: ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమా కాపీరైట్ కేసు.. దిల్‌రాజు, దర్శకుడు దశరథ్‌కు స్వల్ప ఊరట

- 2011లో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’
- తన నవల ‘నా మనసు కోరింది నిన్నే’ ఆధారంగా దీనిని తీశారంటూ కేసు వేసిన రచయిత్రి ముమ్మిడి శ్యామల
- కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టుకు దిల్‌రాజు, డైరెక్టర్ దశరథ్
- రెండు వారాలపాటు ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని దిల్‌రాజు, దశరథ్‌లకు ఆదేశం
ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో 2011లో విడుదలైన సినిమా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’. తాను రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’నవల ఆధారంగా మోసపూరితంగా ఈ సినిమాను తీసి, తన హక్కులకు భంగం కలిగించారంటూ 2017లో రచయిత ముమ్మిడి శ్యామల కోర్టును ఆశ్రయించారు. అయితే, కాపీరైట్ కాలపరిమితి ముగిసింది కాబట్టి కేసును కొట్టివేయాలని కోరుతూ నిర్మాత దిల్‌రాజ్, ఈ మూవీ దర్శకుడు కొండపల్లి దశరథ్ సప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లను నిన్న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా దిల్‌రాజు, దశరథ్‌కు సుప్రీం స్వల్ప ఊరట కల్పిస్తూ ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించింది. అయితే, సమస్యను పరిష్కరించుకోవాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారని దిల్‌రాజు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని హెచ్చరించింది.
నిన్న జరిగిన విచారణలో తొలుత దిల్‌రాజు తరపున హాజరైన న్యాయవాది కృష్ణదేవ్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టివేసిందని, సీఆర్‌పీసీ సెక్షన్ 468 కింద ఉన్న కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద నమోదైన మరో కేసునూ కొట్టివేయాలని కోర్టును కోరారు. అయితే, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమా 2011లో విడుదలైతే 2017 జులై 12న సీఆర్‌పీసీ సెక్షన్ 200 కింద రచయిత కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
స్పందించిన న్యాయస్థానం.. ఈ సినిమా నిరంతరం టీవీల్లో ప్రసారం అవుతోంది కాబట్టి, ప్రాథమికంగా ఇది నిరంతరం సాగే నేరంగానే కనిపిస్తోందని, కాబట్టి ఈ అంశాన్ని తాము పరిశీలించాలనుకుంటున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులోని ప్రతివాదికి నోటీసులు జారీచేస్తూ రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి వరకు ట్రయల్ కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు, సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారని న్యాయస్థానం హెచ్చరించింది.