ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ గెలిచింది... పాక్ కథ ముగిసింది!

  • బంగ్లాదేశ్ ను 5 వికెట్ల తేడాతో ఓడించిన కివీస్
  • 237 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఛేదించిన వైనం
  • రచిన్ రవీంద్ర సెంచరీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘనవిజయం అందుకుంది. తద్వారా సెమీస్ లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. 

అనంతరం 237 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ టీమ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి విజయభేరి మోగించింది. కివీస్ ఇన్నింగ్స్ లో రచిన్ రవీంద్ర సెంచరీనే హైలైట్. రచిన్ రవీంద్ర 105 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 112 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. 

టామ్ లాథమ్ 55, డెవాన్ కాన్వే 30, గ్లెన్ ఫిలిప్స్ 21  (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, నహీద్ రాణా, ముస్తాఫిజూర్ రెహ్మాన్, రిషాద్ హసన్ తలో వికెట్ తీశారు. 

కాగా, ఇవాళ కివీస్ విజయం అనంతరం గ్రూప్-ఏ నుంచి టీమిండియా సెమీస్ బెర్తు కూడా ఖరారైంది. కివీస్ విజయంతో ఆతిథ్య పాకిస్థాన్ కథ ముగిసింది. పాక్ గ్రూప్-ఏలో ఇప్పటివరకు తానాడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. ఆ జట్టు ఈ నెల 27న బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిచినా పెద్దగా ప్రయోజనం లేదు. 

ఇక, చెరో రెండు విజయాలతో న్యూజిలాండ్, భారత్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్ బెర్తులు దక్కించుకున్నాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా కివీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కివీస్, భారత్ మార్చి 2న తలపడనున్నాయి.


More Telugu News