Zelensky: శాంతి లభిస్తుందంటే పదవిని వదిలేస్తా: జెలెన్ స్కీ

zelenskyy says ready to give up presidency if it brought peace and nato membership
  • అధ్యక్ష పదవి వదులుకోవడానికి సిద్దమేనన్న జెలెన్‌స్కీ
  • ఉక్రెయిన్‌‌కు నాటోలో సభ్యత్వం ఇవ్వాలన్న కండిషన్
  • అమెరికా అధ్యక్షుడు అన్నట్లు తాను నియంతను కాదని స్పష్టీకరణ  
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ - రష్యా మధ్య యుద్ధం మూడేళ్లుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా వ్యాఖ్యానిస్తూ..  తమ దేశంలో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికైనా తాను సిద్ధమని జెలన్‌స్కీ ప్రకటించారు. 

అయితే అందుకు ఉక్రెయిన్‌కు నాటో‌లో సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 'జెలెన్‌స్కీ ఓ నియంత, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను నియంతను కాదని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. 

అమెరికా – ఉక్రెయిన్ మధ్య ఖనిజ నిక్షేపాల ఒప్పంద చర్చల ప్రక్రియ ముందుకు సాగుతోందని, సహజ వనరులను పంచుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. పుతిన్ మళ్లీ తమపై దాడి చేయకుండా చూసుకోగలిగేది ఆమెరికా మాత్రమేనని, అందుకే ఆమెరికా అవసరం తమకు ఉందని జెలెన్‌స్కీ అన్నారు. 

యుద్ధం ముగింపుకు భద్రతా హామీలపై చర్చించేందుకు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ కు వస్తున్నాయని, ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధానికి స్వస్తి పలికే ఏ చర్చల్లోనైనా తమ భాగస్వామ్యం ఉండాల్సిందేనని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
Zelensky
Ukraine
Russia
Vladimir Putin
America

More Telugu News