Mohammad Rizwan: మా కొంప ముంచింది అవే.. భారత్‌తో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్

Pak Captain Rizwan Explains Reason Behind Pakistan Loss To India
  • మ్యాచ్‌లో చాలా పొరపాట్లు చేశామన్న మహ్మద్ రిజ్వాన్
  • భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని ప్రశంస
  • తాము ఏ విభాగంలోనూ రాణించలేకపోయామని ఆవేదన
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో నిన్న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. తొలుత పాకిస్థాన్‌ను 241 పరుగులకు కట్టడి చేసిన భారత జట్టు ఆ తర్వాత 42.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. మాజీ సారథి విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో భారత్‌కు ఘన విజయాన్ని అందించిపెట్టాడు. 

మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. మ్యాచ్‌లో తాము చాలా పొరపాట్లు చేశామని, పరాజయానికి అదే కారణమని చెప్పాడు. టాస్ గెలిచినప్పటికీ దాని నుంచి ప్రయోజనం పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. వారు తమను ఒత్తిడిలోకి నెట్టేశారని పేర్కొన్నాడు. ఓడిపోయామంటే దానర్థం ఏ విభాగంలోనూ తాము రాణించలేదనేనని వివరించాడు.  

కోహ్లీని కట్టడి చేద్దామని అనుకున్నా, ఆ పని చేయలేకపోయామని రిజ్వాన్ పేర్కొన్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో కోహ్లీ, గిల్ మ్యాచ్‌ను తమ చేతుల్లోంచి లాక్కున్నారని అన్నాడు. ఫీల్డింగ్‌ను తాము మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము చాలా తప్పిదాలు చేశామని చెప్పాడు 

కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దారుణంగా ఓడిన పాకిస్థాన్.. తాజాగా భారత్ చేతిలో అంతే దారుణంగా ఓడింది. నేడు రావల్పిండిలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే పాక్ కథ ముగిసినట్టే. డిఫెండింగ్ చాంపియన్స్ అయిన పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌‌ను గురువారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. 
Mohammad Rizwan
Champions Trophy 2025
Team India
Team Pakistan

More Telugu News