India-Pakistan Match: పాకిస్థాన్ ను చుట్టేశారు... టీమిండియా ముందు సింపుల్ టార్గెట్

Team India bundled out Pakistan for 241 runs in Champions Ttophy clash
  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ × పాకిస్థాన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్
  • కుల్దీప్ యాదవ్ కు 3 వికెట్లు... 2 వికెట్లు తీసిన పాండ్యా
  • పాక్ జట్టులో 62 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచిన సాద్ షకీల్ 
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు టీమిండియా-పాకిస్థాన్ సమరం జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగుల స్కోరుకే ఆలౌట్ అయింది. పాక్ జట్టులో సాద్ షకీల్ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 46, స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ 23, కుష్ దిల్ షా 38 పరుగులు చేశారు. 

ఓ దశలో పాక్ జట్టు 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బాబర్ అజామ్ ను హార్దిక్ పాండ్యా ఓ చక్కని అవుట్ స్వింగర్ తో అవుట్ చేయగా... మరో ఓపెనర్ ఇమాముల్ హక్.... అక్షర్ పటేల్ విసిరిన అద్భుతమైన త్రో కారణంగా రనౌట్ అయ్యాడు. ఈ దశలో సాద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్ జోడీ క్రీజులో పాతుకుపోయింది. మూడో వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. వీరి ఊపు చూస్తే పాక్ భారీ స్కోరు సాధిస్తుందనిపించింది. 

అయితే,  అక్షర్ పటేల్ బంతికి రిజ్వాన్ బౌల్డ్ అవడంతో ఈ పార్టనర్ షిప్ బ్రేకయింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మరోసారి విజృంభించి ఫామ్ లో ఉన్న సాద్ షకీల్ ను పెవిలియన్ కు పంపించాడు. 8 పరుగుల తేడాతో రిజ్వాన్, సాద్ అవుటయ్యాక పాక్ పతనం వేగంగా సాగింది. కుష్ దిల్ షా కొంచెం పోరాడడంతో పాక్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 

టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సమయోచితంగా విజృంభించడంతో పాక్ వికెట్లు టపటపా రాలాయి. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2, హర్షిత్ రాణా 1, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.
India-Pakistan Match
Champions Trophy 2025
Dubai

More Telugu News