India-Pakistan Match: ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్ తో పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్

Pakistan won the toss against Team India in Champions Trophy encounter
  • నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థుల పోరు
  • దుబాయ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడుతున్నాయి. దుబాయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ గ్రూప్-ఏ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పై యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు. వేదిక ఎక్కడైనా సరే స్టేడియం పుల్ అయ్యే మ్యాచ్ లలో దాయాదుల క్రికెట్ సమరం కూడా ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 

ఇక, టీమ్ ల విషయానికొస్తే... స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్ లో ఆడనుండడం పాక్ జట్టుకు ఊరట కలిగించే విషయం. బాబర్ నిన్నటి వరకు కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడినట్టు తెలుస్తోంది. టీమిండియా విషయానికొస్తే... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేడన్న మాటేగానీ... బలమైన జట్టునే బరిలో దింపుతోంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి తోడు యువ పేసర్ హర్షిత్ రాణా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. 

వీరికి తోడు పేస్ తో ప్రత్యర్థులకు కళ్లెం వేసేందుకు హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లతో భారత స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. 

బ్యాటింగ్ డెప్త్ చూస్తే... కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా టచ్ లోకి వస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు.

టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

పాకిస్థాన్
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజామ్, సాద్ షకీల్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, కుష్ దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
India-Pakistan Match
Champions Trophy 2025
Toss
Dubai

More Telugu News