Health: రోజూ ఉదయమే నిమ్మరసం, పసుపు... కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

what happens when you drink lemon turmeric water every morning
  • ఉదయం లేవగానే టీ, కాఫీ తాగడం చాలా మందికి అలవాటు
  • కానీ వాటి వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనం అంతంతే...
  • దానికి బదులు నిమ్మరసం, పసుపు కలిపి తాగితే ఏమేం లాభాలు ఉంటాయనే దానిపై నిపుణుల సూచనలివే..
చాలా మంది ఉదయమే కాఫీ లేదా టీ తాగడం, అందులోకి బిస్కెట్లో, బ్రెడ్డో తినడం అలవాటు. వాటి వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనం అంతంతే అన్నది నిపుణుల మాట. దానికి బదులు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, కాసింత పసుపు కలుపుకొని తాగితే... ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఇది అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే సాధారణ పసుపు పొడి కాకుండా... పసుపు కొమ్మును అరగదీసి వాడే పసుపు పేస్ట్ తో ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

వృద్ధాప్య లక్షణాలు దూరంగా... చర్మం యంగ్ గా...
పసుపు, నిమ్మ రెండూ కూడా చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలు దూరంగా ఉంటాయని వివరిస్తున్నారు. నిమ్మరసంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. అది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మం బిగుతుగా, సాగే లక్షణంతో ఉండేందుకు కొల్లాజెన్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పసుపులోని యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు... మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తాయని వివరిస్తున్నారు. రోజూ ఉదయమే పసుపు, నిమ్మరసం కలిపి తీసుకుంటే నిగనిగలాడే చర్మం మీ సొంతం అవుతుందని పేర్కొంటున్నారు.

శరీరం పరిశుభ్రం...
నిమ్మ, పసుపు రెండూ కూడా శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటికి పంపేందుకు అద్భుతంగా తోడ్పడతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిమ్మలోని విటమిన్ సి, పసుపులోని కర్క్యుమిన్, ఇతర రసాయన సమ్మేళనాలు మన కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు. రోజూ ఉదయమే ముడి పసుపు, నిమ్మరసం కలిపి తీసుకుంటే... శరీరం రిఫ్రెష్ అవుతుందని పేర్కొంటున్నారు.

పసుపు, నిమ్మరసంతో ప్రయోజనాలు మరెన్నో...
  • పసుపు, నిమ్మరసం రెండూ కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతంగా పనిచేసేవే. నిమ్మలోని విటమిన్ సి రోగ నిరోధక కణాల ఉత్పత్తిని పెంచుతుందని... పసుపులోని కర్క్యుమిన్ శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • నిమ్మ రసం మన కాలేయం బైల్ రసాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తుంది. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి దోహదం చేస్తుంది. జీర్ణమైన ఆహారంలోని పోషకాలను శరీరం బాగా సంగ్రహించేలా నిమ్మరసం తోడ్పడుతుంది.
  • పసుపులోని పదార్థాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చి... గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
  • జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు కూడా పసుపులోని పదార్థాలు తోడ్పడతాయని నిపుణులు వివరిస్తున్నారు.
  • ఉదయమే పరగడుపున ముడి పసుపు, నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మధుమేహం, ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు... ఆహారంలో మార్పుల విషయంలో వైద్యుల సలహా తీసుకుని, పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరికి కొన్ని రకాల పదార్థాలతో ఎలర్జీలు ఉండే చాన్స్ ఉంటుందని, అలాంటి వారు కూడా కొత్తగా అలవాట్లు మొదలుపెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Health
Turmeric
Lemon
Viral News
science
offbeat

More Telugu News