పనామా హోటల్ లో భారత అక్రమ వలసదారులు.. బంధించారా? బస కల్పించారా?

  • అమెరికా నుంచి 300 మంది అక్రమ వలసదారులను పనామా తరలించిన అధికారులు
  • సాయం చేయండంటూ హోటల్ కిటికీల నుంచి బాధితుల వేడుకోలు
  • స్వదేశానికి వెళ్లడానికి సగం మంది ఇష్టపడడం లేదంటున్న అధికారులు
అక్రమ వలసదారులను అమెరికా వారి స్వదేశాలకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విమానాలలో భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. తాజాగా 300 మంది అక్రమ వలసదారులను పనామాకు చేర్చింది. అందులో భారతీయులతో పాటు పాక్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, ఇరాన్, చైనా తదితర దేశాల పౌరులు ఉన్నారని సమాచారం. అమెరికా తరఫున వారిని స్వదేశాలకు పంపే బాధ్యతను పనామా స్వీకరించింది. ఈ క్రమంలోనే అక్రమ వలసదారులను ఓ హోటల్ లో ఉంచింది. హోటల్ చుట్టూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో అక్రమ వలసదారులను హోటల్ లో బంధించారా? లేక బస కల్పించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హోటల్ గదిలోని కిటికీల నుంచి అక్రమ వలసదారులు సాయం కోరుతూ విజ్ఞప్తులు చేస్తున్నారు. పేపర్ మీద హెల్ప్ అని రాసి ప్లకార్డుల మాదిరిగా ప్రదర్శిస్తున్నారు. కొంతమంది కన్నీళ్లు పెడుతూ వేడుకోవడం కనిపిస్తోంది. కాగా, అమెరికా ఖర్చుతో అక్రమ వలసదారులకు వసతి కల్పించామని, వారిని మాతృదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని పనామా ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోవాలని వారికి సూచించింది. అయితే, మొత్తం 300 మందిలో 171 మంది మాత్రమే తమ దేశానికి వెళ్లిపోతామని చెప్పారని, మిగతావారు అందుకు ఇష్టపడడం లేదని పనామా అధికారులు చెబుతున్నారు. స్వదేశాలకు వెళ్లడానికి ఇష్టపడని వారికి తాత్కాలికంగా తమ దేశంలోనే వసతి కల్పిస్తామని, వారి విషయంలో ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.




More Telugu News