ఫ‌ఖార్ జమాన్‌కు గాయం... ఆందోళ‌న‌లో పాకిస్థాన్‌

  • నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
  • క‌రాచీ వేదిక‌గా పాక్‌, కివీస్ మ్యాచ్‌
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ 
  • తొలి ఓవ‌ర్ లోనే ఆతిథ్య జ‌ట్టుకు ఊహించ‌ని షాక్‌
  • ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ స్టార్ ప్లేయ‌ర్ ఫ‌ఖార్ జ‌మాన్‌
దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌రుగుతోంది. ఈ రోజు ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు తెర‌లేచింది. పాకిస్థాన్ లోని క‌రాచీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌, న్యూజిలాండ్ త‌ల‌ప‌డుతున్నాయి. అయితే, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ కు మొద‌టి ఓవ‌ర్ లోనే భారీ షాక్ తగిలింది. 

ఫీల్డింగ్ చేస్తూ పాకిస్థాన్ స్టార్ ప్లేయ‌ర్ ఫ‌ఖార్ జ‌మాన్ గాయ‌ప‌డ్డాడు. దాంతో వెంట‌నే మైదానం వీడాడు. అత‌డి స్థానంలో క‌మ్రాన్ గులామ్ స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్‌గా గ్రౌండ్‌లోకి దిగాడు. ఈ నేప‌థ్యంలో ఫ‌ఖార్ గాయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ‌ర్గాలు స్పందించాయి. 

ఫ‌ఖార్ తొడ‌ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో ఇబ్బంది ప‌డ్డాడు... అత‌డిని వైద్య బృందం ప‌రిశీలిస్తోంది... ఏదైనా అప్‌డేట్ ఉంటే వెంట‌నే ఇస్తాం అని పీసీబీ పేర్కొంది. ఇక గ‌తంలో కూడా ఫ‌ఖార్ జమాన్ చాలాసార్లు గాయ‌పడ్డాడు. అత‌ని మోకాలికి ఆప‌రేష‌న్ కూడా అయింది. గాయాల కార‌ణంగా చాలా కాలం జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ఇప్పుడు మ‌రోసారి అత‌డు గాయ‌ప‌డ‌టంతో పాక్ శిబిరంలో ఆందోళ‌న నెల‌కొంది. 

ఫ‌ఖార్ బ్యాటింగ్ చేయ‌క‌పోతే పాక్‌కు చాలా న‌ష్టం: ర‌మీజ్ రాజా
ఇక ఫ‌ఖార్ జ‌మాన్ గాయ‌ప‌డి మైదానం వీడుతున్న స‌మ‌యంలో కామెంట్రీ బాక్స్ లో పాక్ మాజీ క్రికెట‌ర్ ర‌మీజ్ రాజా ఉన్నాడు. ఆయ‌న మాట్లాడుతూ.. ఫ‌ఖార్ తీవ్రంగానే గాయ‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోందని అన్నాడు. "అతడు చాలా నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. అతడు మైదానం వీడుతున్నాడు. ఇది పాక్ కు దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌. ఒక‌వేళ ఫ‌ఖార్ బ్యాటింగ్ చేయ‌క‌పోతే జ‌ట్టుకు చాలా న‌ష్టం. పాక్ కు ఇది ఆందోళన క‌లిగించే విష‌యం" అని ర‌మీజ్ చెప్పుకొచ్చాడు. 


More Telugu News