Nita Ambani: పాండ్యా బ్రదర్స్ గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పిన నీతా అంబానీ

- పాండ్యా బ్రదర్స్ కథ చాలా భిన్నమైందన్న నీతా అంబానీ
- ఆర్థిక ఇబ్బందుల వల్ల హార్దిక్, కృనాల్ మూడేళ్లు మ్యాగీ తిని గడిపారని వెల్లడి
- వారి పట్టుదల, కసి చూసి తమ జట్టులోకి తీసుకున్నామని వ్యాఖ్య
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఓ ప్రత్యేకత ఉంది. టాలెంటెడ్ క్రికెటర్లను వెతికిపట్టుకోవడంలో ముంబయికి ఏ ఫ్రాంచైజీ సాటిరాదంటే అతిశయోక్తి కాదు. వారి ప్రతిభాన్వేషణ ఫలితంగానే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి ఎంతో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.
అయితే, పాండ్యా బ్రదర్స్ కథ చాలా భిన్నమైందని ఆ ఫ్రాంచైజీ యజమానురాలు నీతా అంబానీ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా హార్దిక్, కృనాల్ మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికారని ఆమె తెలిపారు. వారి పట్టుదల, కసి చూసి తమ జట్టులోకి తీసుకున్నామని చెప్పారు.
"రంజీ మ్యాచ్ లు మొత్తం గాలించి మరీ హార్దిక్, కృనాల్, బుమ్రాలను అప్పట్లో వేలంలో కొనుగోలు చేశాం. ప్రతిభావంతులైన క్రికెటర్ల కోసం రంజీ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ టోర్నీలకు వెళ్లి క్రికెటర్ల ఆటను నిశితంగా పరిశీలించేవాళ్లం. అందులో భాగంగా ఒకరోజు బక్కబలచని పొడవైన ఇద్దరు కుర్రాళ్లు మా శిబిరానికి వచ్చారు.
ఈ ఆల్‌రౌండర్లతో మాట్లాడాక ఒక విషయం ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడేళ్లు కేవలం మ్యాగీ తినే గడిపారట. కానీ, ఆ సోదరుల్లో క్రికెట్ పట్ల ఎంతో ప్రేమ, కసి కనిపించాయి. వారే హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య. 2015లో రూ. 10లక్షలతో కొన్న హార్దిక్ ఇప్పుడు ముంబయి ఇండియన్స్ జట్టుకు గర్వించదగ్గ కెప్టెన్‌గా అయ్యాడు" అని నీతా అంబానీ చెప్పుకొచ్చారు.