Bengaluru: తాగునీటితో కారు కడిగితే ఇక భారీ జరిమానా.. బెంగళూరు వాటర్ బోర్డ్ వార్నింగ్!

In Bengaluru Rs 5000 Fine If Drinking Water Is Used For These Activities
  • గతేడాది వేసవిలో వేధించిన నీటి కొరత.. ఈసారి ముందస్తుగా చర్యలు చేపట్టిన బోర్డ్
  • తాగునీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా
  • మళ్లీ అదే తప్పు చేస్తే 5 వేలు అదనంగా వడ్డింపు
వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలు చేపట్టింది. గతేడాది ఎదుర్కొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈసారి పటిష్ఠ చర్యలు చేపట్టింది. ముందుగా తాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాగునీటిని వాహనాలు కడగడానికి, తోటలకు, నిర్మాణ పనులు, ఫౌంటెయిన్ లలో ఉపయోగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే అదనంగా మరో 5 వేలు వడ్డిస్తామని, రోజుకు రూ.500 చొప్పున ఫైన్ విధిస్తామని పేర్కొంది. 

వాటర్ బోర్డ్ యాక్ట్ లోని సెక్షన్ 109 ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. బెంగళూరు నగరంలో ఈ వేసవిలో తాగునీటికి కొరత ఏర్పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈమేరకు బెంగళూరు వాసులకు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటిని వృథా చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. వాటర్ బోర్డ్ కాల్ సెంటర్ నెంబర్ 1916 కు ఫోన్ చేసి చెప్పాలని కోరింది.

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని వాటర్ బోర్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఐఐఎస్ సీ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేసింది. గతేడాది వేసవిలో నగరంలోని 14 వేల బోరుబావులు ఎండిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈసారి తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది.
Bengaluru
Drinking Water
Water crisis
Water board
5k fine

More Telugu News