ఎవరినీ తొలగించం... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో మంత్రి డీవీబీ స్వామి సమావేశం
  • ఉద్యోగుల హేతుబద్ధీకరణపై చర్చలు
  • ఏ, బీ, సీ కేటగిరీలుగా హేతుబద్ధీకరణ చేస్తామని వెల్లడి
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి నేడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో సమావేశం అయ్యారు. సర్వీసు హేతుబద్ధీకరణపై ఉద్యోగుల సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రమోషన్లు కల్పించాలని, పీఆర్సీ అమలు చేయాలని మంత్రికి వినతులు అందాయి. 

ఈ సందర్భంగా మంత్రి డీవీబీ స్వామి మాట్లాడుతూ... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఏ, బీ, సీ కేటగిరీలుగా హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, సర్వీసు నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. హేతుబద్ధీకరణపైనా అధికారుల కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. 

హేతుబద్ధీకరణ ప్రక్రియతో కొందరిని తొలగిస్తారన్న అపోహలు వద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరినీ తొలగించట్లేదని, కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయని వివరించారు. మహిళా పోలీసుల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి డీవీబీ స్వామి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిపార్ట్‌మెంట్ టెస్టులు పాస్ కాకుండా ప్రమోషన్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని అంశాలను  పరిగణనలోకి తీసుకుని హేతుబద్ధీకరణ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 


More Telugu News