Vikatan: సంకెళ్లతో మోదీ కార్టూన్.. తమిళ వెబ్ పత్రికపై కేంద్రం వేటు

Vikatan website blocked after cartoon on PM Modi
  • భారతీయ వలసదారులకు సంకెళ్లు వేసి పంపుతున్న అమెరికా
  • ట్రంప్ ముందు మోదీ సంకెళ్లతో కూర్చున్నట్టు కార్టూన్ ప్రచురించిన ‘వికటన్‘
  • కేంద్ర సమాచార మంత్రికి ఫిర్యాదు చేసిన తమిళనాడు బీజేపీ చీఫ్
  • రెండు రోజులుగా నిలిచిపోయిన ‘వికటన్‘ ప్రసారాలు
సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న వారిని వెనక్కి పంపుతున్న అమెరికా వారికి సంకెళ్లు వేస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇప్పటి వరకు భారత్ చేరుకున్న మూడు విమానాల్లోని వలసదారులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెదవి విప్పకపోవడాన్ని ప్రశ్నిస్తూ తమిళనాడు డిజిటల్ మ్యాగజైన్ ‘వికటన్’ ఈ నెల 10న ప్రచురించిన కార్టూన్ తీవ్ర వివాదాస్పదమైంది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు మోదీ సంకెళ్లతో కూర్చున్నట్టుగా ఉన్న కార్టూన్‌ను ప్రచురించింది. ఇది మోదీని కించపరిచేలా ఉందంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ నెల 15న కేంద్ర సమాచార మంత్రి ఎల్.మురుగన్‌కు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గత రెండు రోజులుగా ‘వికటన్’ పోర్టల్ ప్రసారాలు నిలిచిపోయాయి.

దీంతో స్పందించిన ‘వికటన్’ యాజమాన్యం.. వెబ్‌సైట్ బ్లాక్ కావడానికి గల కారణాలు తెలుసుకుంటున్నట్టు తెలిపింది. కేంద్ర సమాచార మంత్రిత్వశాఖను సంప్రదిస్తామని పేర్కొంది. మరోవైపు, వెబ్‌సైట్‌ను నిలిపివేయడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళిగ వెట్రి కళగం పార్టీ నేత, ప్రముఖ  నటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు చీఫ్ సెల్వపెరుంతగై సహా పలువురు ఖండించారు. బీజేపీ ఫాసిస్టు ధోరణికి ఇంతకుమించిన ఉదాహరణ అక్కర్లేదని దుమ్మెత్తి పోశారు. 
Vikatan
Tamil Website
Narendra Modi
BJP

More Telugu News