Payyavula Keshav: రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపుపై మంత్రి సీరియస్

- బిల్లులు ఎందుకు చెల్లించారంటూ అధికారులను నిలదీసిన మంత్రి పయ్యావుల
- మీ సొంత నిర్ణయమా లేక ఎవరైనా సిఫార్సు చేశారా అంటూ ఆరా
- ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు కాదని అధికారుల వివరణ
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన విశాఖ రుషికొండ ప్యాలెస్ చుట్టూ పలు వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్యాలెస్ నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్ కు తాజాగా అధికారులు బిల్లులు చెల్లించారు. ఈ విషయం తెలిసి మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులపై సీరియస్ అయ్యారు.
కాంట్రాక్టర్ కు బిల్లులు ఎందుకు చెల్లించారని అధికారులను నిలదీశారు. బిల్లులు చెల్లించాలన్న నిర్ణయం అధికారుల సొంత నిర్ణయమా లేక ఎవరైనా సిఫార్సు లేదా ఒత్తిడికి తలొగ్గి తీసుకున్నదా అని ఆరా తీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను పయ్యావుల ఆదేశించారు. అయితే, ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని అధికారులు వివరణ ఇచ్చారు.
అదే కాంట్రాక్టర్ చేపట్టిన వేరే పనులకు సంబంధించిన బిల్లులు మాత్రమే చెల్లించామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ మంత్రి సంతృప్తి చెందలేదు. ఇతర బిల్లులైనా సరే ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సదరు కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించవద్దని గతంలోనే సూచించినా వినకుండా ఎలా చెల్లిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఇకముందు ఆ కాంట్రాక్టర్ కు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని మంత్రి పయ్యావుల స్పష్టంగా ఆదేశించారు.