Gold Heist: 400 కిలోల బంగారం, 2.5 మిలియన్ డాలర్ల నగదు.. కెనడాలో దోపిడీ చేసి చండీగఢ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న నిందితుడు!

Suspect of biggest gold heist in Canada worth 20 million dollar tracked living in Chandigarh outskirts
  • రెండేళ్ల క్రితం కెనడాలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ దోపిడీ
  • కార్గో టెర్మినల్ నుంచి మాయమైన 6,600 బంగారు కడ్డీలు, 2.5 మిలియన్ డాలర్ల నగదు
  • జ్యూరిచ్ నుంచి విమానంలో వచ్చిన కాసేపటికే సొత్తు మాయం
  • ‘ప్రాజెక్ట్ 24 క్యారెట్’ పేరుతో ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు
కెనడాలో 400 కిలోల బంగారం, 2.5 మిలియన్ డాలర్ల నగదు దోపిడీ కేసు నిందితుడు చండీగఢ్ శివారులోని ఓ అద్దె ఇంట్లో తన భార్యతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎయిర్ కెనడా మాజీ మేనేజర్ అయిన సిమ్రన్ ప్రీత్ పనేసర్ (32)పై దోపిడీ కేసులో మోస్ట్ వాంటెడ్. కెనడాలో అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

పనేసర్ తాజాగా చండీగఢ్ శివారులో మాజీ మిస్ ఇండియా ఉగాండా, గాయని, నటి అయిన ప్రీతితో కలిసి ఓ అద్దె ఇంట్లో సాధారణ జీవితం గడుపుతున్నట్టు గుర్తించారు. ఈ దోపిడీలో ప్రీతి ప్రమేయం లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం పనేసర్ న్యాయ బృందం కెనడాలో అతడి కేసును పర్యవేక్షిస్తోంది. 

2023, ఏప్రిల్‌లో కెనడాలో జరిగిన ఈ భారీ దోపిడీ సినిమాను తలపించింది. టొరొంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కార్గో టెర్మినల్ నుంచి 400 కిలోల బరువున్న 6,600 బంగారు కబడ్డీలు, దాదాపు 2.5 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ చోరీకి గురయ్యాయి. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి విమానంలో వచ్చిన ఈ సొత్తు కొన్ని గంటల్లోనే అపహరణకు గురైంది. 

చోరీ విషయం వెలుగులోకి రాగానే దర్యాప్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా 40కిపైగా ఎలక్ట్రానిక్ పరికరాలను స్కాన్ చేశారు. చోరీ జరిగిన వెంటనే బంగారంలో ఎక్కువభాగం దుబాయ్, ఇండియాకు చేరినట్టు తేలింది. ఇప్పటి వరకు 4.3 లక్షల డాలర్ల నగదు, 89 వేల డాలర్ల విలువైన ఆరు బంగారు బ్రాస్‌లెట్లు, బంగారం కరిగించేందుకు ఉపయోగించే అచ్చులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కేసు దర్యాప్తుకు పోలీసులు ‘ప్రాజెక్ట్ 24 క్యారెట్’ అని పేరు పెట్టారు. 20 మంది అధికారులు సంవత్సర కాలంగా క్షణం కూడా తీరిక లేకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది అనుమానితులను చేర్చారు. వారిలో పనేసర్‌తోపాటు పరమపాల్ సిద్దూ (ఎయిర్ కెనడా ఉద్యోగి) కూడా ఉన్నాడు. దోపిడీకి వీరే సాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పనేసర్‌తోపాటు దుబాయ్‌లో దాగిన అర్సలాన్ చౌదరి అనే మరో అనుమానితుడిని కూడా గుర్తించారు. 

దోపిడీలో పనేసర్ పాత్రను గుర్తించే సరికే అతడు కెనడా వదిలి భారత్ చేరుకున్నాడు. గతేడాది జూన్‌లో అతడు లొంగిపోతాడని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. భారత్‌లోనే ఉంటూ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నారు. 
Gold Heist
Canada
Simran Preet Panesar
Chandigadh

More Telugu News