Health: నిద్రకు ముందు వాము, సోంపు టీ.. శరీరంలో వచ్చే మార్పేమిటో తెలుసా?

- మన శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాల్లో వాము, సోంపు రెండింటికీ స్థానం
- జీర్ణ వ్యవస్థ నుంచి ఇమ్యూనిటీ దాకా ఎన్నో ప్రయోజనాలు
- అలాంటివి రెండింటినీ కలిపి తీసుకుంటే వచ్చే లాభాలపై నిపుణుల సూచనలు
మన శరీరానికి వాము, సోంపు రెండూ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆహారం సరిగా జీర్ణం అవడం నుంచి ఇమ్యూనిటీ దాకా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. అలాంటిది రెండింటినీ కలిపి తీసుకుంటే... అది కూడా రాత్రి నిద్రకు ముందు టీ చేసుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ దీనిని అలవాటు చేసుకుంటే జరిగే మేలు ఏమిటో వివరిస్తున్నారు.
నిద్రకు ముందు తీసుకునేవే కీలకం
రోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు చేసే డిన్నర్, తాగే డ్రింక్స్ మీ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే... రాత్రి భోజనం, డ్రింక్ తర్వాత శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇస్తారు, సుమారు ఏడెనిమిది గంటల పాటు మరేమీ తీసుకోరు. ఆ సమయంలో శరీరం దెబ్బతిన్న కణాలు, ఇతర భాగాల రిపేరింగ్ పనులు చేసుకుంటుందని వివరిస్తున్నారు. అలాంటి సమయంలో శరీరానికి మేలు చేసే, జీవక్రియలను ఉత్తేజపరిచే డ్రింక్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం వాము, సోంపులతో చేసిన టీ అద్భుతంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఉబ్బరం, గ్యాస్ సమస్యకు చెక్...
వాము, సోంపు రెండూ కూడా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని కొన్ని పదార్థాలు జీర్ణ రసాల విడుదలను ఉత్తేజితం చేసి.. ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యకు చెక్ పడుతుందని వివరిస్తున్నారు. రాత్రి నిద్రకు ముందు ఈ రెండింటితో చేసిన టీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఇబ్బందులు తగ్గుతాయని, మంచి నిద్రకు తోడ్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం...
మనలోని ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించే లక్షణాలు వాములో ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక సోంపుకు స్వల్పంగా మత్తు కలిగించే లక్షణం ఉంటుందని వివరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మనలో నాడీ వ్యవస్థకు విశ్రాంతి భావన వస్తుందని... ఒత్తిడి తగ్గి మంచి నిద్రకు తోడ్పడుతుందని పేర్కొంటున్నారు.
శరీరాన్ని పరిశుభ్రం చేయడం...
వాము, సోంపు రెండింటిలో కూడా మన శరీరంలో నుంచి విష పదార్థాలు, వ్యర్థాలను బయటికి పంపించే లక్షణాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇవి కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మన శరీరం రోజూ రాత్రి విశ్రాంతి సమయంలో విష పదార్థాలు, వ్యర్థాలను క్లీన్ చేస్తుందని... అదే సమయంలో వాము, సోంపు టీ తీసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.