Chandrababu: ఆ పనులు అనుకున్న సమయానికి జరగాల్సిందే: చంద్రబాబు నాయుడు ఆదేశాలు

- ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాల్సిందే
- అన్ని అనుమతులు, నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదు
- 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి
- పోలవరం ఫలితాలు వచ్చేనాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదుబాటులోకి రావాలి
- గ్రౌండ్ వాటర్ పెంపుపై ప్రణాళికకు నాలుగు శాఖల మంత్రులతో కమిటీ
- వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి.. త్వరలో ప్రాజెక్టును సందర్శిస్తా
- జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్దేశిత లక్ష్యాల మేరకు జరగాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని, వాటిని సరిదిద్ది రైతులకు సాగునీరు అందించాలంటే లక్ష్యాలను చేరుకునేలా పనులు వేగవంతంగా జరగాలని ఆయన అన్నారు. ముఖ్యంగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల్లో ఈ రోజుకు ఎంత పని జరగాలనే దానిపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.
ప్రతి నెలా ఎంత పని జరగాలనేది లక్ష్యంగా పెట్టుకుని, ఆ మేరకు పనులు పూర్తయ్యాయా? లేదా అనేది క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అనుమతులు ఉండి, నిధుల సమస్య లేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సచివాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై ఆయన సమీక్ష జరిపారు.
సమావేశంలో భాగంగా, ముందుగా పోలవరం ప్రాజెక్టు పనుల గురించి అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1,379 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉండగా, గత నెలలో ప్రారంభమైన పనుల్లో ఇప్పటి వరకు 35 మీటర్లు పూర్తయిందని, ఇంకా 1,344 మీటర్లు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వివరించారు.
పోలవరం ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం జరిగిందని అధికారులు తెలపగా, పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే సమీక్ష నాటికి పనుల్లో వృద్ధి కనిపించాలని ఆయన అన్నారు. పోలవరం కాలువల సామర్థ్యం విషయంలో మొదట ఎంత సామర్థంతో (17500 క్యూసెక్కులు) అయితే డిజైన్ చేశారో, అంతే సామర్థ్యం మేర నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనుమతులు, నిధులు ఉన్నందున పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరగాలని, 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి అవ్వాలనే లక్ష్యంతో పనులు చేయాలని ఆదేశించారు.
ఏ కారణాల వల్లనైనా అయినా 2027 జూన్ నాటికి పనులు పూర్తి కాకపోతే, 2027 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి విశాఖకు నీళ్లు తీసుకువెళ్లే సమయానికి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావాలన్నారు. తద్వారా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మళ్లించే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, పనులు సజావుగా సాగేలా చూడాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తన చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, ఆ ప్రాంత అవసరాలను గుర్తించి 2014-19 మధ్యలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనులను ముందుకు తీసుకువెళ్లానని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం డ్రామాలు చేసి, పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసిందని విమర్శించారు. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన అన్నారు.
25 ఏళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్టు నేటికీ పూర్తి కాకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని, తాము ఎలా న్యాయం చేయబోతున్నామో కూడా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అధికారులు ఈ ప్రాజెక్టు పూర్తిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, తాను కూడా ప్రాజెక్టును సందర్శించి, త్వరితగతిని ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
పోలవరం-బనకచర్ల కార్పొరేషన్
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం-బనకచర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై కసరత్తు చేయాలని ఆదేశించారు. నిధుల సమీకరణ కోసం కేంద్రంతో చర్చిస్తున్నామని, దీనిపై పలు ఆలోచనలు ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పంట కాలువల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఉన్న వెయ్యికి పైగా చిన్న ఎత్తిపోతల పథకాలను తిరిగి మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు.
భూగర్భ జలాల పెంపు నా కల
భూగర్భ జలాల పెంపు అంశంపై తాను మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం భూగర్భ జలాల పెంపునకు అనేక చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భూమిలో 3 నుంచి 9 మీటర్ల లోతులో భూగర్భ జాలాల లభ్యమయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వాయర్లలో నీటిని సమృద్ధిగా ఉంచి, ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు అవలంబించడంతో పాటు భూమిలో నీటి లభ్యతను పంచేందుకు అన్ని శాఖలు కలిసి పని చేయాలని సూచించారు.
భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక కోసం పంచాయతీ రాజ్, ఫారెస్ట్, ఇరిగేషన్, వ్యవసాయ, మునిసిపల్ శాఖ మంత్రులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కమిటీ భూగర్భ జలాల పెంపు, పచ్చదనం పెంపుపై కసరత్తు చేసి సూచనలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.