Headache: తరచూ తలనొప్పి వస్తోందా... ఈ ఆరు సమస్యలు కావొచ్చు!

health risks that a frequent headache is telling you

  • కొంత మందిని తరచూ వేధిస్తున్న తలనొప్పి 
  • నిద్ర లేకపోవడమో, మరేదో కారణమో అని భావించి నిర్లక్ష్యం చేసేవారే ఎక్కువ
  • అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు తలనొప్పి ఒక సూచిక అని చెబుతున్న నిపుణులు 

ఇటీవలి కాలంలో తరచూ తలనొప్పితో బాధపడేవారి సంఖ్య పెరిగిపోయింది. రణగొణ ధ్వనులు ఓవైపు, తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి మరోవైపు తలనొప్పికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మన శరీరంలో ఏర్పడే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలనొప్పి రూపంలో బయటపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని జాగ్రత్తగా గమనించి, తగిన చర్యలు తీసుకుంటే... మంచిదని సూచిస్తున్నారు.

రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)
యుక్త వయసు దాటిన వారిలో తరచూ తలనొప్పి వస్తోందంటే... వారిలో రక్తపోటు స్థాయి సరిగా లేదని అర్థమని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ ప్రెషర్ తక్కువగాగానీ, ఎక్కువగా గానీ ఉండటం, ఉన్నట్టుండి పెరుగుతూ, తగ్గుతూ ఉండటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

తీవ్ర ఒత్తిడి (స్ట్రెస్)
ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడి మధ్య జీవిస్తున్నారు. అయితే ఇలా ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగితే... వారు తరచూ తలనొప్పి బారిన పడతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆహారం జీర్ణ కాకపోవడం...
సరిగా నిద్రలేకపోవడం, వేళకు తినకపోవడం, మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటివాటికితోడు పలు ఇతర సమస్యల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణంకాదు. ఇలాంటి వారిలో తలనొప్పి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు తీవ్ర స్థాయిలో తలనొప్పితో బాధపడే అవకాశం ఎక్కువని వివరిస్తున్నారు.

కంటి సమస్యలు..
ఎవరిలోనైనా కంటి చూపు సమస్య మొదలైందంటే... అది తలనొప్పి రూపంలో మొదట బయటపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తరహా తలనొప్పి మరీ తీవ్రంగా ఉండదని... కానీ ఎక్కువ సేపు ఉండటం, తరచూ సమస్య తలెత్తడం జరుగుతుందని వివరిస్తున్నారు. తరచూ స్వల్పస్థాయి తలనొప్పి వేధిస్తుంటే... కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మైగ్రేన్...
మెదడులోని రసాయనాల స్థితిలో తేడాలు రావడం వల్ల తీవ్ర స్థాయి తలనొప్పి వస్తుంది. దీనిని మైగ్రేన్ గా పిలుస్తారు. ఈ తరహా తలనొప్పిలో ఎక్కువ వెలుతురును, శబ్దాన్ని భరించలేకపోతారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ తలెత్తే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్...
ఎవరైనా తరచూ, తీవ్ర స్థాయిలో తలనొప్పితో బాధపడుతూ కారణం ఏమిటో గుర్తించలేకపోతే... అది బ్రెయిన్ ట్యూమర్ సమస్య కావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మెదడులో కణతులు ఏర్పడితే... తలనొప్పి సమస్య తరచూ వేధిస్తుందని, తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మరెన్నో కారణాలు... తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు...
ఒక్కసారిగా మొదలయ్యే తలనొప్పి... కొన్నిసార్లు గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందటి లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అరుదు అని పేర్కొంటున్నారు. మెదడులో ద్రవాలు పేరుకుపోవడం వంటివి కూడా తలనొప్పికి దారితీయవచ్చని చెబుతున్నారు. అందువల్ల తరచూ తలనొప్పి వేధిస్తుంటే... ముందుగా వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Headache
Health
offbeat
science
Viral News
  • Loading...

More Telugu News