Rishabh Pant: అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు.. అస‌లేం జ‌రిగిందంటే..!

Man Who Saved Rishabh Pants Life Takes Poison With Girlfriend She Dies
  • 2022లో రూర్కీ సమీపంలో భారత క్రికెటర్ రిషభ్‌ పంత్ కారుకు ప్ర‌మాదం
  • మంట‌ల్లో చిక్కుకున్న పంత్ ను మ‌రో వ్య‌క్తితో క‌లిసి కాపాడిన ర‌జ‌త్ కుమార్‌
  • తాజాగా తన ప్రియురాలితో కలిసి విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
  • ప్రేయ‌సి మృతి.. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ర‌జ‌త్‌
  • త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో జంట‌ క‌ఠిన నిర్ణ‌యం
2022లో భారత క్రికెటర్ రిషభ్‌ పంత్ కారు ప్రమాదానికి గురైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న‌ 25 ఏళ్ల రజత్ కుమార్ మ‌రో వ్య‌క్తితో క‌లిసి పంత్ ప్రాణాలు కాపాడాడు. దాంతో ఒక్క‌సారిగా అత‌ని పేరు మీడియాలో మార్మోగిపోయింది. అయితే, ర‌జ‌త్ కుమార్ తాజాగా తన ప్రియురాలు మను కశ్యప్ తో కలిసి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ సంఘటన ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్ జిల్లాలోని బుచ్చా బస్తీ అనే గ్రామంలో జరిగింది. 

త‌మ ప్రేమ‌ను వారి కుటుంబ సభ్యులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఈ జంట విషం తాగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌ను క‌శ్య‌ప్‌ చికిత్స పొందుతూ చ‌నిపోగా, ర‌జ‌త్‌ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అతడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

కులాలు వేరు కావ‌డంతో వారి కుటుంబాలు వారి వివాహాలను వేరే వ్య‌క్తుల‌తో ఏర్పాటు చేశాయి. దాంతో మ‌న‌స్తాపం చెందిన ప్రేమ జంట‌ ఆత్మహత్యకు య‌త్నించింద‌ని స‌మాచారం.

కాగా, డిసెంబర్ 2022లో పంత్ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు కారులో వెళుతుండగా, ఆయన మెర్సిడెస్ కారు రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. దాంతో సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ర‌జ‌త్ కుమార్‌, నిషు కుమార్ ఆ ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తారు. పంత్‌ను కాలిపోతున్న వాహనం నుంచి బయటకు తీసి అత్యవసర వైద్య సహాయం కోసం ఏర్పాటు చేశారు. ఇక త‌న ప్రాణాలు కాపాడిన వారిద్ద‌రికి పంత్ తరువాత స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు. 
Rishabh Pant
Girlfriend
Rajat Kumar

More Telugu News